వాయివ్య బంగాళాఖాతంలో ఏర్పడి అల్పపీడన ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో చాలా చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో ఈనెల 18న మరొక ఆవర్తన ద్రోణి ఏర్పడే చాన్స్ ఉందని ప్రకటించింది. అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ తో పాటు ఆదిలాబాద్, కుమ్రంభీం, మంచిర్యాల, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో అక్కడక్కడ వర్షాలు పడ్డాయన్నారు అధికారులు.
కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు తాడ్వాయి, మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట్, బిక్కనూర్ సదాశివనగర్ మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు జనం. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని పలు మండలాల్లో ముసురుతో చిరు జల్లులు పడుతున్నాయి.
ALSO READ :రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలో రాత్రి భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి చిరుజల్లులు పడుతున్నాయి. మరోవైపు జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లిలో వర్షం పడుతోంది. రెయిన్ ఎఫెక్ట్ తో సింగరేని ఓపెన్ కాస్ట్ 2,3 గనుల్లోకి వరదనీరు భారీగా చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇటు హైదరాబాద్ లో రాత్రి నుంచి ముసురు పట్టింది. నగరవ్యాప్తంగా పలు చోట్ల వర్షం పడుతోంది.