ఊర్లకు ఊర్లే మునిగినయ్​.. ముంచెత్తిన వరద.. ఉప్పొంగిన వాగులు

  • ఊర్లకు ఊర్లే మునిగినయ్​..  ముంచెత్తిన వరద.. ఉప్పొంగిన వాగులు
  • 14 మంది మృతి.. 20మందికి పైగా గల్లంతు
  • గోదావరి ఉగ్రరూపం
  • జలదిగ్బంధంలో వందలాది గ్రామాలు
  • కట్టుబట్టలతో రోడ్డునపడ్డ 40 వేల కుటుంబాలు
  • రిలీఫ్​ క్యాంపులకు 10 వేల మంది తరలింపు
  • వెయ్యికి పైగా ఇండ్లు నేలమట్టం

వెలుగు, నెట్​వర్క్​/హైదరాబాద్:  జోరు వాన.. ఎటు చూసినా వరద.. తెగిన రోడ్లు.. మునిగిన ఊర్లు.. చెట్టుకొకరు, పుట్టకొకరుగా జనం.. బిక్కుబిక్కుమంటూ సాయం కోసం ఎదురుచూపులు.. ఇవీ బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా కనిపించిన దృశ్యాలు. భారీ వర్షాలు రాష్ట్రంలో జలవిలయం సృష్టించాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలను అతలాకుతలం చేశాయి. భూపాలపల్లి, ములుగు, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ, కొత్తగూడెం జిల్లాలు ఆగమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పెద్దసంఖ్యలో చెరువులు,  రోడ్లు తెగిపోయి, వందలాది గ్రామాలతోపాటు పట్టణాల్లోని కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆదిలాబాద్​,  ఆసిఫాబాద్​, మంచిర్యాల, నిర్మల్​, నిజామాబాద్​, సిరిసిల్ల, పెద్దపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, వనపర్తి, కరీంనగర్​ జిల్లాల్లోనూ అతి భారీ వర్షం కురిసింది. ప్రాథమిక సమాచారం మేరకు రాష్ట్రవ్యాప్తంగా 14 మంది మృతి చెందారు. మరో 20 మందికిపైగా గల్లంతయ్యారు. 40 వేల కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డునపడ్డాయి. పది వేల మంది పునరావాస కేంద్రాలకు తరలివెళ్లారు. 

కూలిన ఇండ్లు.. దెబ్బతిన్న రోడ్లు..

రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికిపైగా ఇండ్లు కూలిపోయాయి. ఇంకో 2 వేలకు పైగా ఇండ్లు దెబ్బతిన్నాయి. రోడ్లు కూడా ఎక్కడికక్కడ కొట్టుకుపోతున్నాయి.  ఇప్పటికే 28 వంతెనలు డ్యామేజ్​ అయ్యాయి. ఆర్​ అండ్​ బీ రోడ్లు వంద కిలో మీటర్లకు పైగా దెబ్బతిన్నాయి. పంచాయతీరాజ్​ రోడ్ల పరిస్థితి కూడా ఇట్లనే ఉన్నది. లక్షలాది ఎకరాల్లో పంటలు కొట్టుకుపోయాయి. వేల సంఖ్యలో మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. 

భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో బీభత్సం

భారీ వర్షాలు భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో బీభత్సం సృష్టించాయి. ఈ రెండు జిల్లాల్లో కలిపి 30కి పైగా ఊర్లు నీటమునిగాయి. జంపన్నవాగు వరద  ప్రవాహం మేడారంలోని సమ్మక్క సారలమ్మ గద్దెలను తాకింది. షాపుల్లోని సరుకులు తడిసిపోయాయి.  మేడారంలో జంపన్నవాగు వరద ఉధృతితో 16 మంది స్థానికులు వరదల్లో చిక్కుకోగా.. ఎన్డీఆర్​ఎఫ్​ బృందాలు రక్షించాయి. హైదరాబాద్‌‌‒భూపాలపట్నం, గుడెప్పాడ్‌‌‒సీరొంచ నేషనల్‌‌ హైవేలపై వాగులు పొంగి రోడ్లు తెగిపోయాయి. పదుల సంఖ్యలో బ్రిడ్జిలు కూలిపోయాయి. 2 జిల్లాలలో కలిపి 50 వేల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయి. నైన్ పాక శివారులో మోరంచవాగుపై బ్రిడ్జి నిర్మాణ పనుల కోసం వచ్చిన ఆరుగురు కూలీలు వరద నీటిలో చిక్కుకోగా.. వారిని ఆర్మీ హెలికాప్టర్ల సహాయంతో రక్షించారు.  తాడ్వాయి మండలంలో బొగ్గుల వాగు ఉధృతికి లింగాపూర్ దగ్గర రోడ్డుకు కొట్టుకుపోవడంతో నేషనల్ హైవే 163 పై రాకపోకలు బందయ్యాయి.  

భద్రాచలంలో 50.5 అడుగులకు చేరిన గోదావరి

24 గంటల్లో భద్రాద్రి జిల్లాలో 39 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో తాలిపేరు, కిన్నెరసాని ఉపనదులతో పాటు వాగులు, వంకలు పోటెత్తాయి. భద్రాచలంలో ఈ ఏడాదిలో మొదటిసారి గురువారం ఉదయం 8 గంటలకు గోదావరి నీటిమట్టం 50.5 అడుగులకు చేరింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, అశ్వాపురం, మణుగూరు, పినపాక, గుండాల, కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి మండలాల్లోని 3,296 మందిని ఆఫీసర్లు పునరావాస కేంద్రాలకు తరలించారు.

గ్రేటర్​వరంగల్​లో  150 కాలనీలు మునక 

గ్రేటర్​ వరంగల్​లో దాదాపు 150 కాలనీలు నీటమునిగాయి. వందల కుటుంబాలను ఆఫీసర్లు రిలీఫ్​ క్యాంపులకు తరలించారు. కాజీపేట రైల్వే స్టేషన్​లోకి నీళ్లు చేరడంతో పలు రైళ్లను రద్దు చేశారు. హనుమకొండలో వడ్డేపల్లి చెరువు కట్టపైనున్న రైల్వే ట్రాక్​పై నీళ్లు నిలవడంతో ఢిల్లీ వైపు వెళ్లే పలు రైల్​ సర్వీసులను క్యాన్సిల్​చేశారు. వరంగల్ హంటర్ రోడ్  ఖమ్మం బ్రిడ్జి జంక్షన్‌లోని జ్యోతిబా పూలే బాలికల రెసిడెన్షియల్ హాస్టల్‌లో రెండ్రోజులుగా చిక్కుకుని ఉన్న 280 మంది స్టూడెంట్లను సాయంత్రం 5 గంటలు దాటాక ఎన్డీఆర్ఎఫ్ టీమ్​లు బోట్ల ద్వారా బయటికి తీసుకొచ్చారు. ఎల్కతుర్తిలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ నీట మునగగా.. దాదాపు 600 మంది పిల్లలను పోలీసులు ట్రాక్టర్ల ద్వారా తీసుకొచ్చారు. 

మున్నేరువాగు ఉగ్రరూపం

ఖమ్మం పక్కనే   ప్రవహించే మున్నేరు ఉగ్రరూపం దాల్చింది. మున్నేరు మట్టం  24 అడుగులకు చేరితే రెండో వార్నింగ్ ఇస్తారు.  ప్రస్తుతం  30.70 అడుగులకు చేరడంతో ఖమ్మం సిటీలోని  వందలాది ఇండ్లలోకి వాననీరు చేసింది.  పద్మావతినగర్ లోని ధ్యాన మందిరంలో చిక్కుకున్న ఏడుగురిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్​ బృందాలను రప్పించారు.   జిల్లాలో 866 ఇండ్లను ఖాళీ చేయించగా 2,005 మందిని పునరావాస కేంద్రాలకు  తరలించారు.   

అంతా ఆగమాగం

 ఆదిలాబాద్  జిల్లా  నేరడిగొండ మండలంలోని కుప్టి , కుమారి , బోరిగాం , కుంటాల  కే , తర్ణం, గాజీలీ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నిర్మల్​ జిల్లా కుంటాల మండలం పాత వెంకూర్, లోకేశ్వరం మండలం పిప్రి, కుబీర్ మండలంలోని మేధార్ కాలనీ, సారంగాపూర్ మండలం వంజార గ్రామాలను వరద చుట్టుమట్టింది. నిర్మల్,  భైంసా పట్టణాల్లో పలు కాలనీలు  జలదిగ్బంధం లో చిక్కు కున్నాయి. భైంసా ఆర్టీసీ డిపో నీట మునిగింది.

కరీంనగర్​ జిల్లాలో 50  గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సుమారు 10 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కరీంనగర్ సిటీలోని పలో ప్రాంతాల్లో  ఇండ్లలోకి భారీగా వరద నీరు చేరింది. సిరిసిల్లలోని చిన్నబోనాల చెరువు తెగడంతో  పట్టణం జలమయమైంది. వేములవాడలోనూ పలు  కాలనీలు నీటి మునిగాయి. పెద్దపల్లి జిల్లా మంథని మండలం గోపాలపూర్ ఇసుక క్వారీలో జేసీబీతో పాటు 19 మంది చిక్కుకుకుపోగా, ఆఫీసర్లు రెస్క్యూ చేశారు. 

మహబూబాబాద్ జిల్లాలో ఆకేరు, మున్నేరు, పాలేరు, రాళ్లవాగు  ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తొర్రూర్ మండలం అమ్మాపురం దగ్గర బ్రిడ్జి కొట్టుకుపోవడంతో పాటు బయ్యారం మండలం నామలపాడు, కేసముద్రం మండలం అర్పనపెల్లి వాగులు పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు బందయ్యాయి.  

మెదక్​ జిల్లాలో మంజీరా నది ఉధృతి వల్ల మరోసారి ఏడుపాయల వనదుర్గమాత ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. రామాయంపేట తహసీల్దార్ ఆఫీస్ జలమయమైంది.  సిద్దిపేట జిల్లాలో  మోయ తుమ్మెద వాగు, అక్కన్నపల్లి వాగు, వీరన్న పేట వాగులు పొంగడంతో  పలు రూట్లలో రాకపోకలు బందయ్యాయి. 

నిజామాబాద్ సిటీలో అనేక కాలనీలు జలమయమయ్యాయి. ఖానాపూర్​ రోడ్డుపై నుంచి వరద పారడంతో ఈ రూట్​ను పోలీసులు క్లోజ్​ చేశారు. కమ్మర్​పల్లి  కేజీబీవీలోకి వరద నీరు రావడంతో 60 మంది స్టూడెంట్స్​కు ఎంపీడీవో ఆఫీసులో షెల్టర్​ ఏర్పాటు చేశారు.  కామారెడ్డి  జిల్లాలో వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో  20 గ్రామాలకు రాకపోకలు బందయ్యాయి. 
 
సూర్యాపేట జిల్లాలో పలు వాగులు ఉప్పొంగడంతో సూర్యాపేట,  ఆత్మకూర్ (ఎస్),  నూతనకల్ మండల్లాల్లో అనేక గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. యాదాద్రి జిల్లాలో  12  చోట్ల లోలెవల్ వంతెనలపై వరద నీరు ప్రవహించడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.