తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఇది రానున్న 48 గంటల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్న ఆవర్తన ప్రభావం వల్ల పశ్చిమ బంగాళాఖాతంలో రాబోయే 48 గంటల్లో అల్పపీడ ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది.
Also Read : ఇదెక్కడి పిచ్చి సామి నీకు.. ! బంతి మీద ఆటోగ్రాఫ్ చేసిన క్రికెట్ ఫ్యాన్
ఈ ప్రభావంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదు అవుతుంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి, డిచ్ పల్లి, ధర్పల్లి, సిరికొండ, జక్రాన్ పల్లిలో వాన దంచికొడుతోంది. డిచ్ పల్లి మండలం గన్నారంలో 14సెంటీ మీటర్లు, చీమనుపల్లిలో 12 సెంటీ మీటర్లు సదాశివనగర్ జుక్కల్, జక్రాన్ పల్లిలో 11 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, నిజాంసాగర్, రుద్రారం, పిట్లం, గాంధారి, బాన్సువాడ, జుక్కల్, తాడ్వాయి, బీర్కూర్ మండలాల్లో వర్షం పడుతోంది.
స్కూళ్లకు లోకల్ హాలిడే
తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. వర్ష ప్రభావం వల్ల విద్యార్థులు స్కూళ్లకు వెళ్లలేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. దీంతో నిజామాబాద్ జిల్లాలోని స్కూళ్లకు ఇవాళ(సెప్టెంబర్ 04) విద్యాశాఖ అధికారులు సెలవు ప్రకటించారు. లోకల్ హాలిడే గా డిక్లేర్ చేశారు.
అటు నిర్మల్, ఉమ్మడి మెదక్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట, అదిలాబాద్, కొమరం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా తెలంగాణలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.