
- వాతావరణ శాఖ వెల్లడి
- రాష్ట్రవ్యాప్తంగా పడిపోయిన టెంపరేచర్లు
- ఆదివారం పొద్దున్నుంచే మబ్బులు
- ఏడు జిల్లాల్లో కురిసిన వడగండ్ల వానలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి వడగండ్ల వానల ముప్పు పొంచి ఉన్నది. ఆదివారం పలు జిల్లాల్లో వడగండ్లు కురవగా.. మరో రెండు రోజుల పాటు ఇలాంటి పరిస్థితులే ఉండే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అక్కడక్కడ వడగండ్ల వర్షాలతో పాటు చాలా జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ఆదివారం నాటి బులెటిన్లో పేర్కొన్నది.
ఆదివారం ఆదిలాబాద్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వడగండ్ల వాన కురిసినట్టు తెలిపింది. సోమ, మంగళవారాల్లోనూ స్వల్పంగా వడగండ్ల వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉంటుందని పేర్కొన్నది. మరోవైపు వచ్చే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్జారీ చేసింది. సోమవారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మంగళ, బుధవారాల్లో ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి మెదక్ జిల్లాలతో పాటు ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
టెంపరేచర్లు పడిపోయినయ్
రాష్ట్రంలో ఆదివారం ఉదయం నుంచి వాతావరణం మారిపోయింది. చాలా చోట్ల మబ్బుపట్టింది. సడన్గా టెంపరేచర్లూ తగ్గిపోయాయి. 40 డిగ్రీలలోపు టెంపరేచర్లు రికార్డయ్యాయి. అత్యధికంగా జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 39.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వనపర్తి జిల్లాలో 39.3, నాగర్కర్నూల్లో 39.2, ఆదిలాబాద్లో 39 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో 38లోపే ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. పలు చోట్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సంగారెడ్డి జిల్లా నాగలగిద్దలో 3.4 సెంటీమీటర్ల వర్షం పడింది. కంగ్టిలో 2.3 సెంటమీటర్ల వర్షపాతం నమోదైంది.
రైతులకు సూచనలు..
వడగండ్ల ప్రభావం ఉన్న రాష్ట్రాల్లో రైతులకు భారత వాతావరణ శాఖ పలు సూచనలు చేసింది. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లోని రైతులకు వడగండ్ల నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించింది. పండ్లు, కూరగాయల తోటలను వడగండ్ల నుంచి రక్షించుకునేలా నెట్స్ ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.