రుతుపవనాలు యాక్టివ్..రాబోయే ఐదు రోజులూ భారీ వర్షాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రుతుపవనాలు యాక్టివ్ అయ్యాయి. దీంతో ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్​ సిటీలోనూ గురువారం భారీ వర్షం కురిసింది. సిద్దిపేట, జయశంకర్​ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, జగిత్యాల, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, మహబూబ్​నగర్, వికారాబాద్, నాగర్​కర్నూల్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. సిద్దిపేట జిల్లా రామారంలో అత్యధికంగా 8.4 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా చిట్యాలలో 5.6 సెంటీ మీటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలో 5.3, సిద్దిపేట జిల్లా దూల్మిట్ట, మహబూబ్​నగర్​ జిల్లా నవాబ్​పేటలో 5.2, పెద్దపల్లి జిల్లా కూనారం, సంగారెడ్డి జిల్లా గుండ్ల మంచనూరులో 4.9, నిర్మల్​ జిల్లా మామడలో 4.5, యాదాద్రి భువనగిరి జిల్లా జలాల్​పూర్​లో 4.4, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో 4.3, మంచిర్యాల జిల్లా దేవులవాడలో 4.1, నిజామాబాద్​ జిల్లా నవీపేటలో 4, రంగారెడ్డి జిల్లా అమనగల్​లో 3.8 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. 

రుతుపవనాలు మరింత అడ్వాన్స్​

నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో మరింత అడ్వాన్స్​ అయినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణాది జిల్లాల్లో పూర్తిగా విస్తరించడంతో పాటు ఉత్తర తెలంగాణలోని వరంగల్, హనుమకొండ, ములుగు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలకు ప్రవేశించినట్టు పేర్కొంది. పదో తేదీన రాష్ట్రంలోకి వస్తాయని అంచనా వేసినా.. వారం రోజుల ముందుగానే (ఈనెల 3న) రాష్ట్రంలోకి రుతుపవనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో రుతుపవనాల విస్తరణ కూడా వేగంగా జరుగుతున్నట్టు అధికారులు చెప్తున్నారు. శుక్ర, శనివారం నాటికి దాదాపు తెలంగాణ అంతటా రుతుపవనాలు విస్తరించే అవకాశాలున్నాయంటున్నారు. ఈ రుతుపవనాల ప్రభావంతో రాబోయే ఐదు రోజులూ వర్షాలు పడతాయని, పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్​ను జారీ చేశారు. కాగా, గురువారం ఉదయం పెద్దపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, జయశంకర్​ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎండలు బాగానే కొట్టాయి. పెద్దపల్లి జిల్లా కమాన్​పూర్​లో అత్యధికంగా 42.9 డిగ్రీల టెంపరేచర్​ రికార్డ్​ అయింది. మంచిర్యాల జిల్లాలో 42.8, కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లాలో 42.5, జగిత్యాల జిల్లాలో 42.1, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 42 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.