
హనుమకొండ, వెలుగు: వచ్చే మూడు రోజులు భారీ వర్షాలున్నాయనే వాతావరణశాఖ హెచ్చరికలతో టీజీఎన్పీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ సిబ్బంది అలర్ట్ గా ఉండాలని సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి సూచించారు. హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్ భవన్ నుంచి ఎన్పీడీసీఎల్ పరిధిలోని16 సర్కిళ్ల ఆఫీసర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. వర్షాలతో ట్రిప్పింగ్స్, బ్రేక్ డౌన్స్ అయితే వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రస్తుతం పంటల కోతలు పూర్తి కాగానే ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటు, వ్యవసాయ సర్వీసుల మంజూరు ప్రక్రియను స్పీడప్ చేయాలని సూచించారు. వచ్చే ఖరీఫ్ నాటికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు సన్నద్ధం కావాలని స్పష్టంచేశారు. మరోవైపు సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఇంటర్ లింకింగ్ పనులు పూర్తి చేసి, కస్టమర్లకు నిరంతరం నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయాలని ఆదేశించారు.
ట్రిప్పింగ్స్ అయ్యే ప్రాంతాలను గుర్తించి, ప్రత్యామ్నాయ పనులు చేపట్టాలని, పోల్ నంబరింగ్, పోల్ మ్యాపింగ్ పనులు పూర్తి చేయాలని తెలిపారు. టీజీ ఎన్పీడీసీఎల్ టోల్ ఫ్రీ నంబర్ 1912కు వచ్చే కాల్స్ మీద పూర్తి పర్యవేక్షణ ఉండాలన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ అమలు చేస్తున్న కన్స్యూమర్ ఫీడ్ బ్యాక్ సెల్ సత్ఫలితాలు ఇస్తోందని ఆఫీసర్లు తెలపగా ఎలక్ట్రిసిటీ సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ సమావేశంలో ఇన్ చార్జ్ డైరెక్టర్లు బి.అశోక్ కుమార్, టి సదర్ లాల్, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సీఈలు కె.తిరుమల్ రావు, అశోక్ , బికం సింగ్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.