నాలుగు రోజులు వానలు..  రెండ్రోజుల పాటు భారీ వర్షాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. శని, ఆదివారాలు భారీ వర్షాలు పడే చాన్స్​ఉందని గురువారం బులెటిన్​లో తెలిపింది. పది జిల్లాల్లో వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంటుందని వెల్లడించింది. ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్​కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, పలు చోట్ల వడగండ్లు పడే ముప్పుందని తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో టెంపరేచర్లు చాలా వరకు తగ్గాయి. ఒకట్రెండు జిల్లాల్లో మినహా అన్ని చోట్ల 40 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయుడుపేటలో అత్యధికంగా 41.6 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. సూర్యాపేట జిల్లా రాయినిగూడెంలో 40.2, ఖమ్మం జిల్లా తిమ్మారావుపేటలో 39.9 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. మరోవైపు సంగారెడ్డి జిల్లా మోగ్దాంపల్లిలో అత్యధికంగా 9.2 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. అదే జిల్లా మల్చెల్మలో 6.7, కోహిర్​లో 4.9, వికారాబాద్ జిల్లా బషీరాబాద్​లో 4.3, సంగారెడ్డి జిల్లా ఆల్గోల్​లో 4, నల్గొండ జిల్లా త్రిపురారంలో 3.7, వికారాబాద్ జిల్లా బంట్వారం, మర్పల్లిలో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.

ఎక్కువ టెంపరేచర్లతోనే వడగండ్లు

రాష్ట్రంలో ఎప్పుడూ లేనంతగా ఇప్పుడే ఎక్కువగా వడగండ్ల వానలు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే, దానికి కారణం అధిక ఉష్ణోగ్రతలేనని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. వేడి ఎంత ఎక్కువుంటే వడగండ్లు అంత ఎక్కువ ఏర్పడడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు. దేశంలోని ఉత్తరాది నుంచి వచ్చే తేమ గాలులు.. ఈ సీజన్​లో వడగండ్ల ప్రభావం ఎక్కువుండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.