హైదరాబాద్, వెలుగు: జులై మొదటి వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు యాక్టివ్గానే ఉన్నాయన్నారు. వాటి ప్రభావంతోనే పలు ప్రాంతాల్లో వానలు పడ్తున్నాయని చెప్పారు. జులైలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపారు. రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేశారు. కాగా, నార్త్ ఇండియాలో రుతు పవనాల విస్తరణ స్లోగా ఉండటంతోనే.. దక్షిణాది రాష్ట్రాల్లో తక్కువ వర్షపాతం నమోదవుతున్నట్టు వివరించారు. మరో రెండు వారాల్లో నార్త్ ఇండియాలోని అన్ని రాష్ట్రాలకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయన్నారు.
దీంతో మాన్సూన్ కరెంట్ (రుతుపవనాల వేగం, వాటి ప్రవాహం)లో వేగం పుంజుకునే చాన్స్ ఉంటుందని తెలిపారు. జూన్ మొదటి వారంలోనే రాష్ట్రంలోకి రుతు పవనాలు ఎంటర్ అయినప్పటికీ.. వానలు మాత్రం కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతున్నాయి. పలు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల మాత్రమే భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని రైతులు తొలకరి జల్లులకే పొలం పనులు మొదలుపెట్టారు. విత్తనాలూ వేశారు.. చాలా చోట్ల మొలకలు కూడా వచ్చాయి. నార్లు పోసే స్టేజ్‌కు వచ్చింది. ఇప్పుడు వర్షాలు సరిగ్గా పడకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
11 జిల్లాల్లో లోటు వర్షపాతం
11 జిల్లాల్లోని 215 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. కేవలం 165 మండలాల్లో సాధారణం కంటే 60 శాతానికిపైగా వర్షపాతం రికార్డయింది. ఉత్తర తెలంగాణలోని 11 జిల్లాల్లో వర్షాలు చాలా తక్కువ పడ్డాయి. మంచిర్యాల జిల్లాలో అత్యధికంగా 74 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఇటు కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ లోటు వర్షాలు రికార్డయ్యాయి. దక్షిణాది జిల్లాల్లో మాత్రం ఎక్సెస్ వర్షాలు పడ్డాయి.
ఆందోళనలో రైతన్నలుఉత్తరాది జిల్లాల్లో ఇంకా ఎండలే..
రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ.. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం టెంపరేచర్లు ఇంకా ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ఇటు దక్షిణాదిలోని ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోనూ అదే రీతిలో టెంపరేచర్లు నమోదవుతున్నాయి. మంగళవారం అత్యధికంగా మంచిర్యాల జిల్లా కొండాపూర్‌లో 41.9 డిగ్రీలు నమోదైంది. ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో 41.7 డిగ్రీలు, భద్రాద్రి కొత్తగూడెంలో 41.5 డిగ్రీలు, కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో 41.3 డిగ్రీలు, సూర్యాపేట, జగిత్యాలల్లో 41.2 డిగ్రీలు, ఖమ్మంలో 40.6 డిగ్రీలు, సంగారెడ్డిలో 40.4 డిగ్రీలు, నిర్మల్‌లో 40.3 డిగ్రీలు, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో 40 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీల్లోపే రికార్డయ్యాయి.
సాయంత్రం కాగానే వానలు
పలుచోట్ల మధ్యాహ్నం దాకా ఎండలు దంచికొడ్తున్నాయి. సాయంత్రం కాగానే మబ్బులు పట్టి వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, భద్రాద్రి, వరంగల్, జనగామ, సూర్యాపేట, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని పలుచోట్ల మోస్తరు వర్షపాతం నమోదైంది. మంగళవారం అత్యధికంగా నల్గొండ జిల్లా కట్టంగూరులో 5.3 సెంటీ మీటర్ల వర్షపాతం రికార్డయింది. అదే జిల్లా పుల్లెంలలో 5.3, రంగారెడ్డి జిల్లా మాడ్గూల్లో 4.7, వరంగల్ జిల్లా సంగెం, సూర్యాపేట జిల్లా మునగాలలో 4, కామారెడ్డి జిల్లా మేనూరులో 3.6, నిజామాబాద్ జిల్లా పోతంగల్లో 3.3 సెంటీ మీటర్ల వర్షం కురిసింది.
నాలుగు రోజులు వానలు
రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, వికారా బాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలోనూ మోస్తరు వర్షం పడే అవకాశం ఉన్నట్టు చెప్పింది.