- తక్షణ సాయం కోసం జిల్లాల్లో కంట్రోల్ రూమ్ల ఏర్పాటు..
- పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
- తీరప్రాంతాల్లో భూపాలపల్లి, ములుగు జిల్లాల కలెక్టర్ల పర్యటన
- పునారావాస కేంద్రాల ఏర్పాటు
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: రెండు రోజులుగా భూపాలపల్లి, ములుగు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరద హోరు కొనసాగుతోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గోదావరికి వరద పోటెత్తుతుంది. ప్రభుత్వం తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసింది. భూపాలపల్లి, ములుగు కలెక్టర్లు రాహుల్ శర్మ, టీఎస్ దివాకర తీర ప్రాంతాలను పరిశీలించారు. ముంపు ప్రాంతాల రక్షణ కోసం ఏటూరునాగారంలో కంట్రోల్ రూమ్ఏర్పాటు చేశారు.
వరదకు కొట్టుకుపోయిన వాహనాలు..
భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని కేశవాపూర్ పెగడపల్లి గ్రామాల మధ్య ఉన్న పెద్దవాగు పొంగిపొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మేడారం మెయిన్ రోడ్డులోని లో లెవెల్ వంతెన పైనుంచి వరద ప్రవహిస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. గురువారం రాత్రి కాటారం-మేడారం ప్రధాన రహదారిపై కొర్లకుంట దగ్గర వంతెనపై నుంచి మహదేవపూర్కు చెందిన ఇద్దరు వ్యక్తులు కారులో వెళ్తుండగా, అదుపుతప్పి వాగులో పడింది.
వరద ప్రవాహం తక్కువగా ఉండటంతో ప్రమాదం తప్పింది. శుక్రవారం కాటారం మండలంలోని దామెరుకుంట-గుండ్రాత్ పల్లి మధ్యలోని అలుగు వాగులో ఓ బొలెరో ట్రాలీ వెహికల్ కొట్టుకుపోయింది. డ్రైవర్ వాహనంపైకి ఎక్కి కేకలు వేయగా, స్థానికులు రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చారు. ఈ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో శుక్రవారం వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మహాదేవపూర్ మండలం సూరారంలో భారీ వర్షానికి కరెంటు పోల్ విరిగి కింద పడింది. కాళేశ్వరంలో మాధురి పెద్ద లచ్చయ్య, నరసమ్మ దంపతుల ఇల్లు వర్షానికి తడిసి గోడ కూలిపోయింది. వెంటనే వారిని ప్రభుత్వ పునరావాస కేంద్రానికి తరలించారు.
ఏటూరునాగారంలో కంట్రోల్ రూమ్..
గోదావరి ముంపు ప్రాంతాల ప్రజల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఏటూరునాగారంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. వాజేడు, వెంకటాపురం, ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం మండలాల్లో 135 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్డీఆర్ఎఫ్ టీంతోపాటు నాలుగు బోట్లు అందుబాటులో ఉంచారు. తక్షణ సహాయం కోసం ఏటూరునాగారం కంట్రోల్ రూమ్ నెo.63098 42395, 08717-293246 కాల్ చేయాలని ములుగు కలెక్టర్ దివాకర ప్రకటించారు.
శుక్రవారం కలెక్టర్ ఏటూరునాగారం మండలంలోని గోదావరి ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ములుగు జిల్లాలోని ఐదు మండలాల్లో 80 ముంపు ప్రాంతాలను గుర్తించినట్లుగా పేర్కొన్నారు. మహదేవ్ పూర్ మండలంలో భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ పర్యటించారు. బొమ్మాపూరు శివారులో కోతకు గురైన మందిరం చెరువు కట్ట, పెద్దంపేట వాగు బ్రిడ్జీ వాగు ప్రవాహాన్ని పరిశీలించారు.
గ్రేటర్ అలర్ట్..!
హనుమకొండ, వెలుగు: ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అత్యవసర సమయంలో ప్రజలు సమస్యలు, ఫిర్యాదులను ఆఫీసర్ల దృష్టికి తీసుకొచ్చేందుకు గ్రేటర్ వరంగల్ హెడ్ ఆఫీస్ లో మాన్ సూన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నెం బర్ 1800 425 1980, వాట్సాప్ 79971 00300, బల్దియా నెంబర్ 97019 99645 లను సంప్రదించాలని గ్రేటర్ కమిషనర్అశ్వినీ తానాజీ వాకడే సూచించారు. గ్రేటర్తోపాటు వరంగల్ జిల్లా ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్ లో మరో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 3434, మొబైల్ నంబర్ 91542 52936 అందుబాటులో ఉంచారు.
భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్లో 24 గంటల పాటు అధికారులు అందుబాటులో ఉండేలా కలెక్టర్ సత్యశారదాదేవి కూడా ఆదేశాలిచ్చారు. అలాగే, గ్రేటర్ వరంగల్ పరిధిలో వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లను గుర్తించడంతో అక్కడ సహాయక చర్యలు చేపట్టడం, లోతట్టు ప్రాంతాలకు ముంపు సమస్యను తప్పించేందుకు ఆరు మాన్ సూన్ యాక్షన్ టీమ్లను ఏర్పాటు చేశారు. శుక్రవారం హనుమకొండలోని సమ్మయ్యనగర్, అమరావతి నగర్, ప్రగతినగర్ తదితర ప్రాంతాల్లో డీసిల్టేషన్ చేపట్టి, వరద ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడకుండా చర్యలు చేపట్టారు.