మూడు రోజుల్లో30 మంది జల సమాధి

  • వరద తగ్గుతున్న కొద్దీ బయటపడుతున్న మృతదేహాలు
  • ఒక్క ములుగు జిల్లాలోనే 11 మంది మృతి
  • పంట చేలల్లో 8 డెడ్‌‌బాడీలు
  • మరికొందరు గల్లంతు

వెలుగు, నెట్‌‌వర్క్: భారీ వర్షాలు, వరదల కారణంగా మూడు రోజుల్లో 30 మంది చనిపోయారు. బుధ, గురువారాల్లో 17 మంది మృతిచెందగా, మరో 20 మందికి పైగా వరదలో కొట్టుకపోయారు. వారిలో కొంతమంది మృతదేహాలు శుక్రవారం దొరికాయి. మొత్తంగా ఒక్క ములుగు జిల్లాలోనే 11 మంది జల సమాధి అయ్యారు. శుక్రవారం కూడా వాగులు, వంకలు దాటే క్రమంలో మరికొంతమంది గల్లంతయ్యారు.

జంపన్నవాగు వరదలో గల్లంతై..

గురువారం సాయంత్రం జంపన్నవాగు వరదలో గల్లంతైన 8 మంది శుక్రవారం అక్కడే ఉన్న పంట చేలల్లో శవాలై తేలారు. కొండాయికి చెందిన తండ్రీ కొడుకులు షరీఫ్ (55), అజహర్ (24), భార్యాభర్తలు రషీద్ ఖాన్ (73)​, కరీమా (69), మజీద్​ఖాన్ (75), అతని భార్య లాల్​బీ (70), దబ్బగట్ల సమ్మక్క (70), మహబూబ్‌‌‌‌ఖాన్‌‌‌‌(60) గురువారం వరదల్లో కొట్టుకుపోయారు. ప్రవాహం తీవ్రంగా ఉండడంతో స్థానికులు వారిని కాపడలేకపోయారు. 

వరద తగ్గిన తర్వాత శుక్రవారం ఉదయం నలుగురి మృతదేహాలను సమీప పంట పొలాల్లో గుర్తించారు. అక్కడికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ టీం మిగతా నలుగురి ఆచూకీ కోసం గాలించగా.. ఆ ప్రాంతంలోనే కనిపించాయి. వర్షాల కారణంగా ములుగు జిల్లాలో 11 మంది చనిపోయినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. గురువారం ఐదు డెడ్​బాడీలు, శుక్రవారం ఏటూరునాగారం, తాడ్వాయిలో మండలాల్లో ఆరు డెడ్​బాడీలు దొరికినట్లు చెప్పారు. 

కరెంట్ తీగలకు వేలాడిన డెడ్‌‌బాడీ

తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క సారలమ్మ టెంపుల్‌‌‌‌కు సమీపంలో కరెంట్‌‌‌‌ తీగలకు వేలాడుతూ యాచకుని మృతదేహం కనిపించింది. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు జంపన్నవాగు ఉప్పొంగింది. మేడారంలోని తల్లుల గద్దెల వరకు వరద వచ్చింది. 

ఇళ్లు, దుకాణాలు మునిగిపోయాయి. గురువారం వరదల్లో ఓ యాచకుడు గల్లంతైన విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. శుక్రవారం తెల్లవారే సరికి ఊరట్టం లో లెవల్‌‌‌‌ బ్రిడ్జి దగ్గర కరెంట్‌‌‌‌ తీగలకు వేలాడుతూ మృతదేహం కనిపించింది. భూమి నుంచి 15 ఫీట్లకు పైగా ఎత్తులో శవం వేలాడుతూ ఉంది. కిందికి దింపించిన తాడ్వాయి పోలీసులు.. అతడి వివరాలేమీ తెలియకపోవడంతో గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి ఖననం చేశారు.

మోరంచపల్లిలో నలుగురి ఆచూకీ దొరకలే

మోరంచపల్లిలో గురువారం గల్లంతైన నలుగురి ఆచూకీ శుక్రవారం కూడా దొరకలేదు. బుధవారం అర్ధరాత్రి ఊరు మునిగిపోవడంతో గొర్రె ఒదిరెడ్డి, గొర్రె వజ్రమ్మ, మహాలక్ష్మి, సరోజన వరదలో కొట్టుకుపోయారు.

వరంగల్ సిటీలో ముగ్గురు మృతి

హనుమకొండ కాపువాడలోని ఓ ఇంట్లో ఉంటున్న ఆళ్లకుంట్ల బాబు (48) అనే కూలీ వరదలో మునిగి చనిపోయాడు. భారీ వర్షాలకు ఈయన ఇల్లు జలమయమైంది. కుటుంబ సభ్యులు పక్కనే కొత్తగా నిర్మిస్తున్న ఓ  బిల్డింగ్‌‌లోకి వెళ్లారు. వాష్​రూమ్ ​కోసం గ్రౌండ్ ఫ్లోర్‌‌‌‌కు వచ్చిన బాబు వరద నీటిలో మునిగిపోయాడు. వాచ్​మన్​ అత డిని పైకి తీసుకురాగా.. నీళ్లు మింగి అస్వస్థతకు గురయ్యాడు. వైద్య సాయం అందక అక్కడే చనిపోయాడు. 

రామన్నపేటకు చెందిన గుర్రం శెట్టి శ్రీనివాస్ (40) బొడ్రాయి వద్ద టెంట్ హౌస్ లో పనిచేస్తున్నాడు. ఆయన మృతదేహం వరదలో కొట్టుకుని వచ్చి ఎస్సీ కాలనీలో శుక్రవారం తేలింది. కాజీపేట మండలం మడికొండ గ్రామంలోని పొలాల్లో ఓ వ్యక్తి మృతదేహన్ని గుర్తించారు. 

తుంపెల్లి వాగులో ఇద్దరు గల్లంతు

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని తుంపెల్లి వాగులో ఇద్దరు గల్లంతయ్యారు. శుక్రవారం ఆసిఫాబాద్ మండలంలోని తుంపెల్లి వాగు ఉప్పొంగడంతో చూసేందుకు తుంపెల్లికి చెందిన రేఖల కౌశిక్, ప్రణీత్ (తుంపెల్లి గూడెన్ ఘట్) అనే ఇద్దరు వెళ్లారు. కాళ్లకు అంటిన బురద కడుక్కునేందుకు కౌశిక్ (11) ప్రయత్నిస్తూ వాగులో పడ్డాడు. అక్కడే ఉన్న నలుగురు కౌశిక్ ను కాపాడేందుకు వాగులోకి దిగారు. వీరిలో గ్యారే మోహన్(40) గల్లంతయ్యాడు. సాయంత్రం వరకు గాలించినా వీరి ఆచూకీ దొరకలేదు.

నిజామాబాద్​ జిల్లా గుండారంలో చెరువు అలుగులో కొట్టుకుపోయి సాయిరెడ్డి (43) చనిపోయాడు. శుక్రవారం అలుగులో చేపలు పట్టేందుకు ప్రయత్నించి, వరదలో కొట్టుకుపోయాడు. ఆ ప్రాంతం పూర్తిగా బండరాళ్లతో నిండి ఉండడంతో తలకు బలమైన గాయాలై మృతి చెందాడు.

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ​మండలం నర్సింగ్​రావుపల్లి నల్లవాగు మత్తడి వద్ద పిట్లంకు చెందిన కృష్ణ(50) గురువారం చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యాడు. శుక్రవారం అతని శవం మత్తడి వద్ద చెట్టు కొమ్మకు చిక్కుకొని కనిపించింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లిలో 3రోజుల క్రితం వాగు దాటుతూ కొట్టుకు పోయిన మహిళ డెడ్​బాడి శుక్రవారం దొరికింది. కుమ్మరిపాడు గ్రామానికి చెంది న కుంజా సీతమ్మ (56) కూలి చేసుకుని బతుకుతోంది. పనికి వెళ్లి వస్తూ ఈ నెల 26న తల్లి, కూతుర్లు పాములేరు వాగు దాటుతూ ప్రమాదవశాత్తు వరద ఉధృతికి వాగులో కొట్టుకుపోయారు. స్థానికులు కూతురు జ్యోతిని రక్షించగలిగారు. 

కరీంనగర్ ​జిల్లా చిగురుమామిడి మండలం నవాబ్‌‌పేట సమీపంలోని ఎల్లమ్మ వాగులో ఓ రైతు కొట్టుకుపోయాడు. వర్షాలకు ఎల్లమ్మవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం సాయంత్రం వ్యవసాయ పనుల కోసం ఎడ్డెల్లి రాజయ్య (50) వాగు దాటే క్రమంలో ప్రమాదవశాత్తు వాగులో కొట్టుకుపోయాడు. గమనించిన స్థానికులు తాళ్ల సాయంతో రక్షించేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు.