వాతావరణ హెచ్చరికలు : రాష్ట్రంలో మరో 2 రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు

వాతావరణ హెచ్చరికలు : రాష్ట్రంలో మరో 2 రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు

తెలంగాణలో రానున్న మూడు రోజుల వరకు వాతావరణ సమాచారాన్ని హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసింది. సెప్టెంబర్ 3 ఉదయం 8 గంటల వాతావరణ పరిస్థితులను బట్టి ఈ అంచనా వేసింది. మంగళవారం, బుధవారం రెండు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

గురువారం(ఎల్లుండి) కొన్ని చోట్ల వర్షాలు కురవవచ్చని వెల్లడించారు. సెప్టెంబర్ 3, 4 తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఉరుములు, గంటకు 30 నుంచి 40 కి. మీ. వేగంతో ఈదురుగాలులు  వీచే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదైయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సోమవారం మధ్య విదర్భ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై అల్ప పీడనం బలహీన పడింది. ఋతుపవన ద్రోని మంగళవారం సగటు సముద్ర మట్టం నుంచి జైసేల్మేర్, ఉదయపూర్,  పశ్చిమ విదర్భ వద్ద ఉన్న అల్పపీడన కేంద్రం మరియు దాని పరిసర ప్రాంతాల్లోనూ రామగుండం, కళింగపట్నం మరియు అక్కడి నుంచి ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది. దీంతో ఉపరితల ఆవర్తనం కోస్తా ఆంధ్ర యానాం, పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుండి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల వరకు ఏర్పడింది.