ఆఫ్ఘనిస్తాన్ లో భారీ వర్షాలు.. 50 మంది మృతి, 200 ఇండ్లు నేలమట్టం

కాబూల్: ఆఫ్ఘనిస్తాన్‌లోని సెంట్రల్ ఘోర్ ప్రావిన్స్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల కారణంగా 50 మంది మృతిచెందారు. అనేక మంది గల్లంతయినట్లు  శనివారం (మే 18) అధికారులు తెలిపారు. శుక్రవారం నుంచి కురుస్తున్న వర్షాలతో సెంట్రల్ ఘోర్ ప్రావిన్స్ ప్రాంతంలో రోడ్డు తెగిపోయానని, దాదాపు 200కు పైగా ఇండ్లు కూలిపోయానని అక్కడి అధికారులు చెబుతున్నారు. 

ప్రావిన్స్ రాజధాని ఫిరోజ్ కోలో 200 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 4వేల ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 2వేల కంటే ఎక్కువ దుకాణాలునీటిలో మునిగిపోయాయని ఆఫ్ఘనిస్తాన్ సమాచారం విభాగం అధికారులు వెల్లడించారు. 

గతవారం ఆఫ్టనిస్తాన్ లో కురిసిన భారీవర్షాలకు 315 మంది చనిపోయారు. బుధవారం ఘోర్ ప్రావిన్స్‌లోని నదిలో పడిపోయిన వ్యక్తుల మృతదేహాలను వెలికితీసే ప్రయత్నంలో ఆఫ్ఘన్ వైమానిక దళం హెలికాప్టర్ సాంకేతిక లోపంతో కూలిపోయి ఒకరు మృతి చెందారు. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

భారీ వర్షాలు ఆఫ్ఘనిస్థాన్‌ అతలాకుతలం 

ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లో వేలాది ఇండ్లు దెబ్బతిన్నాయి, పశువులు కొట్టుకుపోయినట్లు అక్కడి అధికారులు తెలిపారు. వీధులు బురదతో కప్పబడ్డాయి.అయితే ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలకు అందడం లేదని సహాయ బృందాలు అంటున్నాయి. 

వరదల వల్ల నష్టపోయిన వారికి సహాయాన్ని అందించాలని ఐక్యరాజ్యసమితి, మానవతా ఏజెన్సీలు, ప్రైవేట్ వ్యాపారులను తాలిబాన్ ఆర్థిక మంత్రి దిన్ మహ్మద్ హనీఫ్  కోరారు. భారీ వర్షాలు, వరదలతో నిరాశ్రయులైన వారిని ఆదుకోవాలని అభ్యర్థించారు. 

అయితే వరద బాధితులకు WFO ఆహారం, సహాయం అందించేందుకు సిద్దమైంది. బగ్లాన్ వంటి ప్రాంతాల్లో ప్రజలకు ఆహారం అందించేందుకు ట్రక్కులు వెళ్లే పరిస్థితి లేదని ప్రత్యామ్నాయ మార్గాలు  ద్వారా బాధితులకు ఆహారం అందించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు WFO తెలిపింది.