బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని(Andhra Pradesh) పలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
రాజమహేంద్రవరం వద్ద గోదావరి వరద ఉద్ధృ తి కొనసాగుతుంది. ధవళేశ్వర కాటన్ బ్యారేజ్ వద్ద 10.8 అడుగుల మట్టం వరకు నీరు వచ్చి చేరింది . సముద్రంలోకి 3.50 లక్షల క్యూసెక్కులకు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కోనసీమ జిల్లా గోదావరి వరద ఉద్ధృతి కారణంగా పంటు ప్రయాణాన్ని అధికారులు నిలిపివేశారు. ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో జిల్లా కలెక్టర్ అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.
ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) వద్ద భారీగా గోదావరి నీటిమట్టం పెరుగుతుంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే ఎగువ నీటి మట్టం వద్ద 29 మీటర్లు, దిగువ నీటిమట్టం వద్ద 19.16 మీటర్లు, ఎగువ కాఫర్ డ్యామ్ నీటి మట్టం 29.15 మీటర్లు, దిగుగవ కాఫర్ డ్యామ్ నీటి మట్టం 18.70 మీటర్ల వరకు నీరు వచ్చి చేరింది. స్పిల్ వే నుంచి అధికారులు 3.50 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అశ్వారావుపేట వాగు, పడమటి వాగు, 20 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ఉమ్మడి తూర్పుగోదావరి(East Godavari) జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాజమహేంద్రవరం, రాజానగరం, అనపర్తి నియోజకవర్గాల్లో భారీగా వర్షం పడింది. మండపేట, కొత్తపేట, పి. గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో వర్షం కురిసింది. తూర్పుగోదావరి జిల్లాలో 7 వేల ఎకరాల్లోని వరినాట్లు, నారుమళ్లు నీటమునిగాయి.