బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురువారం ( అక్టోబర్ 17) నెల్లూరు జిల్లాలో తడ దగ్గర 22 కిలో మీటర్ల వేగంతో తీరం దాటింది. ఇది అల్పపీడనంగా మారి బలహీనపడుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రెండు రోజుల పాటు ( 17,18) భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కృష్ణపట్నం, మచిలీపట్నం ఓడరేవుల్లో ఒకటో నెంబరు హెచ్చరికలు జారీ చేసింది.
దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశముందన్నారు. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ కడప, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదముందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కృష్ణపట్నం, నిజాంపట్నం, మచిలీపట్నం వాడరేవుల్లో మూడో నంబరు, కాకినాడ, గంగవరం, విశాఖపట్నం, కళింగపట్నం పోర్టులకు ఒకటో నంబరు హెచ్చరికలు జారీ చేశారు.
వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, శ్రీ సత్యసాయి ,తిరుపతి, అనంతపురం, కడప, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. పలు ప్రాంతాల్లో వరద ముప్పు వాటిల్లే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ అధికారులు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.