జీహెచ్ఎంసీ హై అలర్ట్.. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్.. టోల్ ఫ్రీ నెంబర్ ప్రకటన

నగరంలో జులై 26 సాయంత్రం, మరుసటి రోజు వరకు భారీ వర్షాలు  కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విపత్తు నిర్వహణ విభాగం అప్రమత్తమైంది.  నగర పౌరులు తక్షణ సాయం కోసం 9000113667 నంబర్​కి సంప్రదించవచ్చని మున్సిపల్ బాడీ డైరెక్టర్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చేసిన ట్వీట్ చేసింది.  

భారత వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్ , శేరిలింగంపల్లి సహా హైదరాబాద్‌లోని మొత్తం ఆరు జోన్‌లలో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ నెల 26, 27 వరకు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు  ఇప్పటికే అధికారులను ఆదేశించారు. తూర్పు, ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, మధ్య తెలంగాణలో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. 

ALSO READ :భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక.. రాములోరి గుడి చుట్టూ నీళ్లు

హైదరాబాద్, దాని పరిసర జిల్లాల్లో కూడా భారీగా వర్షపాతం నమోదవుతోంది.  27న కూడా ఇదే పరిస్థితి ఉంటుందనే అంచనాల నేపథ్యంలో ప్రజాప్రతినిధులు అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. నగరంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. 

అధికారులు సమయానికి స్పందించకపోవడంతో అసహనానికి గురవుతున్నారు.   ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా సహా పలు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.