వదలని వాన.. వణికిన గ్రేటర్

హైదరాబాద్: మూడ్రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వానలు గ్రేటర్​ను వణికించాయి. గురువారం తెల్లవారుజామున నుంచి సిటీలోని అన్ని ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. మియాపూర్, ఈస్ట్ ఆనంద్ బాగ్, మల్కాజిగిరి, కాప్రా, ఉప్పల్ ప్రాంతాల్లో గురువారం ఉదయం 8.30 నుంచి రాత్రి11 గంటల వరకు సుమారు 11 సెం.మీకుపైగా వర్షపాతం నమోదైంది. షేక్ పేట, దూలపల్లి, కుత్బుల్లాపూర్​ ఓక్షిత ఎన్​క్లేవ్​తో పాటు కొన్నిచోట్ల కాలనీల్లో నీరు చేరడంతో జనం ఇండ్లకే పరిమితమయ్యారు. మెయిన్​రోడ్లు మొదలుకొని కాలనీలకు వెళ్లే రోడ్లు చెరువులను తలపించాయి.

నారాయణగూడలోని ఆదర్శ్​నగర్ బస్తీ నీట మునిగింది.  పంజాగుట్ట, హైటెక్ సిటీ, ఉప్పల్, లింగంపల్లి, తార్నాక, టొలిచౌకి, మెహిదీపట్నం, ఖైరతాబాద్, కూకట్ పల్లి, మాదాపూర్ ఇలా అన్ని చోట్ల రోడ్లపై నీరు చేరింది. ముషీరాబాద్, కవాడీగూడ, బేగంబజార్ ప్రాంతాల్లో మూడు పురాతన భవనాలు కూలాయి. వర్షం నాన్ స్టాప్​గా పడటంతో చాలామంది మెట్రోను ఆశ్రయించగా.. ఆ రైళ్లలో రద్దీ పెరిగింది. లింగంపల్లి రైల్వే అండర్ పాస్ వద్ద నడుం లోతు నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడ ఓ కారు నీటిలో చిక్కుకోగా.. డీఆర్ఎఫ్​ సిబ్బంది స్థానికుల సాయంతో బయటకు తీసుకొచ్చారు. చార్మినార్ యునాని ఆస్పత్రి మొదటి అంతస్తు నుంచి నీరు లీకేజీ కావడంతో పలువార్డుల్లోకి వర్షపు నీరు చేరింది. దీంతో పేషెంట్లు ఇబ్బంది పడ్డారు. 85 ఏండ్ల పురాతన భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో నాలుగేళ్లుగా అక్కడక్కడ లీకేజీలు అవుతూ వార్డుల్లోకి వరద నీరు వస్తోంది. మరోవైపు సిటిజన్ల నుంచి బల్దియా హెల్ప్ లైన్ నం.040– 040--21111111కు గురువారం 300కి పైగా ఫిర్యాదులు వచ్చాయి. 45 ఫిర్యాదులపై డీఆర్ఎఫ్ టీమ్స్ స్పందించాయి. 

డీఆర్ఎఫ్ సాయం కోసం 9000113667కు కాల్ చేయాలని అధికారులు తెలిపారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ రోనాల్డ్ రోస్, కలెక్టర్ అనుదీప్, వాటర్ బోర్డు ఎండీ దానకిశోర్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి అలర్ట్​గా ఉండాలని ఆదేశించారు. ఎక్కడైనా మ్యాన్ హోల్ మూత ధ్వంసమైనా, తెరిచి ఉంచినట్లు గమనించినా వాటర్ బోర్డు కస్టమర్ కేర్ నం.155313,  వర్షానికి సంబంధించి అప్​డేట్​ కోసం  కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నం.  040–-23202813, మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే 8897549792కు కాల్ చేయాలని అధికారులు తెలిపారు. 

 హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ లెవెల్ 513.41 మీటర్లు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 513.45 మీటర్లకు చేరింది. హుస్సేన్​సాగర్​లో చేరిన వరద నీరు ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళేలా  అలుగులు, తూము ద్వారా బయటకు పంపుతున్నారు.