హైదరాబాద్లో భారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో దంచికొట్టిన వాన

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం(ఆగస్టు 18) మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసఫ్ గూడ, రహమతి నగర్, మోతి నగర్, బోరబండలో వర్షం పడుతోంది. దీంతో రోడ్లపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ట్రాఫిక్ తో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో శుక్ర, శనివారాల్లో(ఆగస్టు 18,19) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్, ఉ త్తర ఈశాన్య బంగాళాఖాతానికి ఆనుకుని తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం కేంద్రికృతమై ఉన్నట్లు వివరించింది. దీని ప్రభావంతోనే అతి భారీ వానలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

ఈరోజు, రేపు(ఆగస్టు 18, 19)  ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. కరీంనగర్, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయని తెలిపింది. చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వివరించింది.