వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో వానలు దంచి కొడుతున్నాయి. హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో కుండ పోత వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల నివాసాల్లోకి వరద నీరు వచ్చిచేరుతుండటంతో పబ్లిక్ తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వర్షాలకు రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీస్ టైమింగ్స్ కావడంతో ఒక్కసారిగా వెహికిల్స్ అన్ని రోడ్లపైకి వచ్చాయి.
నిమిషాల ప్రయాణానికి గంటల సమయం పడుతుండటంతో ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారు.జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, లింగంపల్లి, కూకట్ పల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, మియాపూర్, చందానగర్, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, పంజాగుట్ట, ఎల్ బీనగర్, హయత్ నగర్, ప్రగతి నగర్, జీడిమెట్ల, సుచిత్ర,కొంపల్లి,దూలపల్లి, దుందిగల్,గండిమైసమ్మ, మల్లంపేట్,బౌరంపేట్, సురారం,జీడిమెట్ల,షాపూర్ నగర్,చింతల్,గాజులరామారం, రాజేంద్రనగర్, అత్తాపూర్, కాటేదాన్, నార్సింగీ, మణికొండ, గండిపేట, బండ్లగూడ తదితర అన్నీ ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.
లింగంపల్లి రైల్వే బ్రిడ్జి కింద భారీగా వరద నీరు వచ్చి చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎర్రగడ్డ మెయిన్ రోడ్డుపై భారీగా వరద నీరు నిలిచింది. మెట్రో పరిధిలో పలు చోట్ల వరద నీరు నిలిచాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మంత్రి తలసాని శ్రీనివాస్ గౌడ్, మేయర్ గద్వాల విజయ వర్షాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష నిర్వహించారు.
రంగారెడ్డి జిల్లాలోని జంట జిల్లాలోని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో హిమాయత్ సాగర్ రెండు గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు వదులుతున్నారు. డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగి సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటిస్తున్నాయి.
పలు ప్రాంతాల్లో ఇదీ పరిస్థితి...
- లింగంపల్లి రైల్వే బ్రిడ్జి కింద భారీగా వరద నీరు వచ్చి చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
- బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్ షాకోట్ పలు కాలనీ లో వర్షపు నీరు చేరింది. అపార్ట్మెంట్ సెల్లార్లో లోకి నీళ్లు పోవడంతో విద్యుత్ కి అంతరాయం ఏర్పడింది.
- మూసారాం బాగ్ - అంబర్ పేట బ్రిడ్జి పై నీరు నిలవడంతో మూసీలోకి మళ్లిస్తున్నారు.
- అంబర్ పేట్ ముసారం బాగ్ వద్ద మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
- మీర్ పేట్ బడంగ్ పేట్ పరిసర ప్రాంతాలలో తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తుండటంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వాహనదారు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
- కూకట్ పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ లో వర్షం దంచికొడుతోంది.
- సికింద్రాబాద్, కంటోన్మెంట్, బేగంపేట, మారేడ్ పల్లి, అడ్డగుట్టలో, సీతాపల్ మండి, రాణిగంజ్, బోయిన్ పల్లి తదితర ప్రాంతాల్లో ఈ ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు రోడ్లపై వరదనీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
- జూబ్లీహిల్స్ లోని కృష్ణానగర్, యూసఫ్ గూడా ప్రధాన రహదారిపై నీళ్లు నిలిచాయి.
- కుత్బుల్లాపూర్ గాజులరామారాంలోని వోక్షిత ఎంక్లేవ్ కాలనీ రోడ్లపై వర్షపు నీరు ప్రవహిస్తోంది.
- పటాన్ చెరు , రామచంద్రా పురం, అమీన్ పూర్ పరిసర ప్రాంతాలలో రోడ్లపై నీరు వరదల్లా ప్రవహిస్తున్నాయి.
- ఎర్రగడ్డ మెయిన్ రోడ్డు పై నీరు నిలిచిపోయింది.
- మియాపూర్ , ఎల్ బీ నగర్ ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
- ఎర్రగడ్డ వద్ద వరద నీటిలో ఆర్టీసి బస్సు చిక్కుకుంది.