హైదరాబాద్ సిటీ పరిధిలో మళ్లీ వర్షం మొదలైంది. చాలా ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది.. కుత్బుల్లాపూర్ ఏరియాలోని సుచిత్ర, బషీరాబాద్, కొంపల్లి, దూలపల్లి, బహుదూర్ పల్లి, గండిమైసమ్మ, బౌరంపేట్, జీడిమెట్ల, షాపూర్ నగర్, చింతల్, గాజులరామారాం, నిజాంపేట, ప్రగతినగర్, కూకట్ పల్లి ఏరియాల్లో వర్షం పడుతుంది. 2024, మే 10వ తేదీ శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుంచి వర్షం మొదలు కావటంతో.. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు రోడ్ల పక్కన ఆగిపోయారు. భారీ వర్షం కావటంతో వాహనాలు నినాదనంగా సాగుతున్నాయి.
నాలుగు రోజుల క్రితం పడిన వర్షంతోనే కరెంట్, ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు జనం. ఆ స్థాయిలో కాకపోయిన భారీ వర్షం పడుతుండటంతో ప్రజలు అప్రమత్తం అయ్యారు. వర్షం కారణంగా ట్రాఫిక్ లో చిక్కుకుపోకుండా కొంత సమయం ఆఫీసుల్లోనే ఉండాలని సూచిస్తున్నారు అధికారులు.
వాతావరణ శాఖ సూచనలు, హెచ్చరికలతో ఇప్పటికే డిజాస్టర్ మేనేజ్ మెంట్ టీమ్స్ రంగంలోకి దిగారు. ఎక్కడైనా చెట్లు కూలితే వెంటనే తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేయనున్నారు. విద్యుత్ శాఖ సిబ్బంది అప్రమత్తం అయ్యారు.