హైదరాబాద్లో దంచి కొడుతున్న వర్షం.. దిల్సుఖ్ నగర్, చైతన్యపురిలో కుండపోత.. మరికొన్ని ప్రాంతాల్లో..

హైదరాబాద్లో దంచి కొడుతున్న వర్షం.. దిల్సుఖ్ నగర్, చైతన్యపురిలో కుండపోత.. మరికొన్ని ప్రాంతాల్లో..

మధ్నాహ్నం వరకు నిప్పుల కుంపటి అన్నట్లుగా ఉంటున్న హైదరాబాద్ వాతావరణం.. సాయంత్రం  అయ్యేసరికి పూర్తిగా మారిపోతోంది. ఉన్నట్లుండి మేఘాలు కమ్ముకుని చల్లబడుతోంది. దీనికితోడు బలమైన ఈదురుగాలులతో వానాకాలాన్ని తలపిస్తోంది. ఇవాళ ( మంగళవారం, ఏప్రిల్ 22) హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. 

దిల్సుఖ్ నగర్, చైతన్యపురిలో వాన బీభత్సం సృష్టిస్తోంది. క్యూములో నింబస్ మేఘాల రాకతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. అదేవిధంగా మలక్ పేట్, సంతోష్ నగర్ ప్రాంతాల్లో కూడా వర్షం ప్రారంభమైంది. ఎల్బీనగర్ ఏరియాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బలమైన గాలులు వీస్తున్నాయి. ఏ క్షణమైనా వర్షం రావచ్చునని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉరుములు, మెరుపులు ఉండటంతో మేడపైన ఉండి ఫోన్ లు మాట్లాడవద్దని హెచ్చరించారు. బయటకు వెళ్లేవారు కచ్చితంగా గొడుగు, రెయిన్ కోట్ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. 

Also Read : టీచర్ అయితే ఎవరికి గొప్పే

గడ్డి అన్నారంలో కూలిన రావిచెట్టు:

గడ్డి అన్నారం పరిసర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. ఈదురు గాలులతో ఏరియా మొత్తం దుమ్ముతో నిండిపోయింది. ఆ తర్వాత భారీ వర్షం కురవడంతో జనాలు ఇళ్లల్లోకి పరుగులు పెట్టారు. వాన ధాటికి కమలా నగర్ రోడ్ నెం.5 లో భారీ రావి చెట్టు కూలిపోయింది. చెట్టు కూలి గోడపై పడటంతో గోడూ కూలిపోయింది. అక్కడే ఉన్నా కారుపై పడి కారు డ్యామేజ్ అయ్యింది. 

అంబర్పేట్లో చిరుజల్లులు:

అంబర్ పేట్ లో చిరుజల్లులు కురిశాయి. అప్పటి వరకు మండుతున్న కాలనీ ఒక్కసారిగా ఈదురుగాలులతో వచ్చిన మేఘాలతో చల్లబడింది. అంబర్ పేట్ పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. కాలనీ రోడ్డుపై సగ భాగం వర్షం కురవడం, మరో సగం కురవకపోవడం పిల్లలను ఆశ్చర్యానికి గురిచేసింది. రోడ్డుపైన నిలబడి సగం సగం కురుస్తున్న జల్లులను అల్లరిగా ఆస్వాదించారు. 

లింగంపల్లి, పటాన్ చెరులో ఈదురుగాలులతో కూడిన వర్షం

పటాన్ చెరు నుంచి లింగంపల్లి వరకు ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. రామచంద్రపురం, అమీన్పూర్, బీరంగూడ  తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. గాలులు భారీగా విస్తుండటంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షం ముగిసే వరకు ఎవరూ బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు అధికారులు.