జగిత్యాల జిల్లాలో దంచికొట్టిన వాన

జగిత్యాల జిల్లాలో దంచికొట్టిన వాన

కొడిమ్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల వ్యాప్తంగా శుక్రవారం భారీగా వర్షాలు కురిశాయి. మండలంలోని శంకునికుంట చెరువుకు వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో కోనాపూర్ గ్రామానికి రాకపోకలు స్తంభించిపోయాయి. పొలం పనులకు వెళ్లిన రైతులను గ్రామస్తులు తాడు సహాయంతో  వాగు దాటించారు. బుగ్గ, పెద్ద వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో పోతారం చెరువు నిండింది. 

మల్యాల, వెలుగు: మల్యాల మండలంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దాదాపు రెండు గంటల పాటు ఆగకుండా భారీ వర్షం కురవడంతో ఆయా గ్రామాల్లోని చెరువులు, కుంటలు నిండాయి. వారం రోజులుగా తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డ జనం ఒక్కసారిగా భారీ వర్షంతో
 సంతోషం వ్యక్తం చేశారు. మల్యాల చెరువు పూర్తిగా నిండి మత్తడి దూకుతుంది.

బోయినిపల్లి, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినిపల్లి నుంచి వేములవాడ రోడ్డులో కోరెం వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు రాకపోకలు నిలిపివేశారు. 

కోనరావుపేట, వెలుగు : కోనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగు ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ శుక్రవారం కురిసిన వర్షానికి జలకళ సంతరించుకుంది. చెరువు మత్తడి పోస్తుండడంతో మూలవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నిమ్మపల్లి ప్రాజెక్టు ద్వారా 2600 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ప్రాజెక్ట్ ను చూసేందుకు గ్రామస్తులు,రైతులు తరలివస్తున్నారు.