కామారెడ్డి, లింగంపేట, పిట్లం, వెలుగు: కామారెడ్డి జిల్లాలో ఆదివారం మళ్లీ అకాల వర్షం కురిసింది. ఇప్పటికే 5 రోజుల కింద కురిసిన భారీ వడగళ్ల వాన రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. మళ్లీ ఆదివారం సాయంత్రం జిల్లాలోని చాలా ఏరియాల్లో బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు చాలా ఊర్లలో వడగళ్లు పడ్డాయి. పంటలు దెబ్బతినగా, కోసి ఆరబోసిన వడ్లు మరోసారి తడిశాయి. సెంటర్లు, రోడ్లపై ఆరబోసిన వడ్లు వర్షపు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గంట పాటు కుండపోత పోసింది.
లింగంపేట, పిట్లం, బిచ్కుంద, మద్నూర్, భిక్కనూరు, దోమకొండ, బీబీపేట, ఎల్లారెడ్డి, నిజాంసాగర్, తాడ్వాయి, బీర్కూర్, నస్రుల్లాబాద్, బాన్సువాడ మండలాల్లో అకాల వర్షం కురిసింది. లింగంపేట మండలంలోని పొల్కంపేట, పోతాయిపల్లి, ముస్తాపూర్, ఐలాపూర్, మెంగారం, బోనాల్, భవానిపేట, సజ్జన్పల్లి, షేట్పల్లి సంగారెడ్డిల్లో రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది. అక్కడక్కడ వడగళ్లు పడ్డాయి. షేట్పల్లి సంగారెడ్డి, కామారెడ్డి, ఎల్లారెడ్డి మెయిన్ రోడ్లపై చెట్లు పడిపోయాయి. ఎక్కపల్లిలో ఇళ్ల మీద చెట్లు పడటంతో దెబ్బతిన్నాయి. జిల్లాలోని చాలా ఏరియాల్లో గంటల తరబడి కరంట్సప్లయ్నిలిచిపోయింది.
కొట్టుకుపోయిన వడ్లు
జిల్లాలోని ఆయా గ్రామాల్లో కోసి కొనుగోలు సెంటర్లు, రోడ్లపై ఆరబోసిన వడ్లు వరదల్లో కొట్టుకుపోయాయి. 5 రోజుల కింద కురిసిన వానకు వరి పూర్తిగా తడిచింది. ఆదివారం ఉదయం వచ్చిన ఎండకు ఆరబోయగా సాయంత్రం మళ్లీ భారీ వాన పడటంతో వడ్ల కుప్పలు తడిసిపోయాయి. కొన్ని చోట్ల వడ్లు కొట్టుకుపోయాయి. వాతావరణం పూర్తిగా చల్లగా ఉండటంతో వరి మొలకెత్తుతోందని రైతులు వాపోతున్నారు.