కామారెడ్డి జిల్లాలో నేలవాలిన పంటలు  

  •       పత్తి, సోయా, అపరాల పంటలకు భారీ నష్టం
  •       కొన్నిచోట్ల కొట్టుకుపోయిన పంటలు
  •      ఆవేదన చెందుతున్న రైతులు

 కామారెడ్డి, వెలుగు : ఉపరితల ద్రోణి ప్రభావంతో కామారెడ్డి జిల్లాలో  మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు  పలు ఏరియాల్లో  పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ వర్షానికి  కొట్టుకుపోవటం, నేలవాలడంతో  రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  వరి పంట నీట మునగగా,  పత్తి, సోయా,  పప్పు దినుసుల పంటలు నేలకొరిగాయి. పొలంలో  నుంచి  కంప్లీట్​గా  నీళ్లు పోతే గానీ   ఇసుక మేటల పరిస్థితి ఏమిటో తెలియదని రైతులు పేర్కొన్నారు.

జిల్లాలో  ఆదివారం రాత్రి నుంచి  మంగళవారం ఉదయం వరకు  పలు మండలాల్లో  భారీ వర్షం కురిసింది.  కొన్ని  చోట్ల 10 సెం.మీ.లకు పైగా  వర్ష పాతం నమోదైంది.  భారీ వర్షంతో  వాగులు పొంగుతున్నాయి. దీంతో వేలాది ఎకరాల్లో వరి పొలాలు నీటమునిగాయి.   కొన్ని చోట్ల మక్క, పత్తి,   సోయా పంటల్లో నీళ్లు నిలవగా, వరద ప్రవాహానికి  వందలాది ఎకరాల్లో పంటలు కొట్టుకుపోయాయి.  

పరిస్థితి  ఇది...

 గాంధారి, సదాశివనగర్, రామారెడ్డి, కామారెడ్డి,  జుక్కల్,  మద్నూర్, బిచ్కుంద,  లింగంపేట, నాగిరెడ్డిపేట,  మాచారెడ్డి,  దోమకొండ,  బాన్స్​వాడ, పిట్లం మండలాల్లో   భారీ వానలు కురిశాయి.  గాంధారి, సదాశివనగర్​, రామారెడ్డి మండలాల్లో  పంటలు దెబ్బతిన్నాయి. 500  ఎకరాల వరకు పంటలు నేలవాలాయి.   గాంధారి మండలంలోని  పలు  గ్రామాల్లో పత్తి,  సోయా,  అపరాల  పంటలకు ఎక్కువ నష్టం జరిగింది.  వాగులు పొంగి ప్రవహించటంతో  గాంధారి,  పొతంగల్, బొప్పాజివాడి, తిప్పారం, మాధవపల్లి, గుడిమెట్,  రాంపూర్​గడ్డతో పాటు, పలు తండాల్లో   పత్తి పంట , అపరాలు,  సోయా పంటలు నేలబారాయి. అక్కడక్కడ  పత్తి పంట కొట్టుకుపోయింది.  

మక్క పంటలో నీళ్లు నిలిచాయి.  వేల రూపాయలు ఖర్చు పెట్టి సాగు చేసిన పంటలు  దెబ్బతినడంతో  రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  సదాశివనగర్​ మండలం, రామారెడ్డి మండలాల్లోని పలు గ్రామాల్లో  పంటల్లో  నీళ్లు నిలిచాయి.    ఎక్కువ రోజులు మక్క, పత్తి పంటలో నీళ్లు నిల్వ ఉంటే   మొలకలు దెబ్బతింటాయని  రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   లింగంపేట, రామారెడ్డి,  నాగిరెడ్డిపేట,  సదాశివనగర్​ మండలాల్లోని  వరి పొలాలు చెరువులు, కుంటలను తలపిస్తున్నాయి. 

1,409 ఎకరాల్లో పంట నష్టం

జిల్లాలో  భారీ వర్షాలకు  25 గ్రామాల్లో 1,409 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అగ్రికల్చర్​ ఆఫీసర్లు  తెలిపారు.  పత్తి  225 ఎకరాలు,  మక్క  145 ఎకరాలు, సోయా 225 ఎకరాలు,  పత్తి 791 ఎకరాల్లో   పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు.  1,139 మంది  రైతులకు నష్టం జరిగిందన్నారు. ఆయా చోట్ల వరి పంటలో నీళ్లు 
నిలిచాయన్నారు.    

దెబ్బతిన్న రోడ్లు

లింగంపేట మండలం నాగారం బ్రిబ్జి వద్ద రోడ్డు రెండు వైపులా కోతకు గురైంది.  సదాశివనగర్​ మండలం  ఉత్తునూర్​ సమీపంలో  రోడ్డు కోతకు గురై గుంత పడింది. రామారెడ్డి మండలం ఉప్పల్​వాయి నుంచి   పోసానిపేట, రంగంపేట, అడ్లూర్​ వరకు ఉన్న రోడ్డు గుంతలు పడ్డాయి.

సగం  పత్తి దెబ్బతింది

బొప్పాజివాడి రోడ్డులో  ఈదుల వాగు వెంట  3 ఎకరాల భూమి ఉంది.  ఇందులో  పత్తి పంట సాగుచేసినా.   ఇప్పటికే  రూ.40వేలకు పైగా ఖర్చు జేసిన.  పెద్ద వానకు  వరద వచ్చి సగం పత్తి పంట దెబ్బతింది.

-  గంద్యాటం పెద్ద సాయిలు, గాంధారి

  2 ఎకరాల్లో సోయా నష్టం

 2 ఎకరాల్లో  సోయా పంట వేసిన. రూ. 20వేల వరకు ఖర్చు జేసిన.   2 రోజులుగా  పెద్ద వానలు కురుస్తుండటంతో  పంట దెబ్బతింది.  పెట్టిన పెట్టుబడి  కూడా వచ్చే పరిస్థితి లేదు.

-  శంకర్​, గాంధారి