కరీంనగర్ జిల్లాను వర్షం మళ్లీ ముంచెత్తింది

కరీంనగర్/కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ జిల్లాను వర్షం మళ్లీ ముంచెత్తింది. సోమవారం సాయంత్రం కరీంనగర్ సిటీతో పాటు చొప్పదండి, రామడుగు, గంగాధర, కొత్తపల్లి, తిమ్మాపూర్, గన్నేరువరం మండలాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం బీభత్సం సృష్టించింది. గంగాధర, కొత్తపల్లి మండలాల్లో వడగండ్ల వాన కురిసింది. కరీంనగర్ సిటీలో సాయంత్రం 5.30 గంటలకే మబ్బులు కమ్ముకుని చీకటిమయమైంది. సుమారు 45 నిమిషాలపాటు వర్షం ఆగకుండా కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.  విద్యానగర్, రాంనగర్, జ్యోతినగర్, సుభాష్ నగర్, కట్టరాంపూర్, అలకాపురి, గాయత్రినగర్, అశోక్ నగర్ తదితర ప్రాంతాల్లోని డ్రైనేజీలోని నీరు రోడ్లపై నిలిచిపోవడంతో జనానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. రామడుగు మండలంలోని కురుమపల్లిలో  షెడ్డు కూలి20 గొర్రెలు మృతి చెందాయి.

నేలరాలిన మామిడి.. తడిసిన ధాన్యం

కొడిమ్యాల,మల్యాల,వెలుగు:  కొడిమ్యాల, మల్యాల మండలాల్లో సోమవారం సాయంత్రం కురిసిన రాళ్ళ వానకు భారీ నష్టం జరిగింది.  మూడు రోజుల క్రితం కురిసిన వర్షంతో కొడిమ్యాలలో సుమారు 2వేల ఎకరాల్లో వరి పంట నష్టం జరిగింది. సోమవారం మరో 500 ఎకరాల్లో నష్టం జరిగినట్లు రైతులు తెలిపారు. పుడూర్, నల్లగొండ, కొడిమ్యాల, చింతల్లపల్లి, తిర్మలపూర్ గ్రామాల్లో రాళ్ళ వాన కురిసింది. పుడూర్ ఐకేపీ సెంటర్ కు తీసుకువచ్చిన వడ్లు మొత్తం నీటిలో మునిగి పోయాయి. 800ల క్వింటాళ్ల వడ్లు నీటిలో కొట్టుకుపోయినట్లు ఉప సర్పంచ్ లింగారెడ్డి తెలిపారు. ‌‌‌‌‌‌‌‌