ఆక్రమణలే  కొంప ముంచినయ్‌‌ .. కోదాడ పట్టణంలో భారీ వర్షం

  • భారీగా వెంచర్లు చేసి అమ్మేసిన రియల్టర్లు  
  • కోదాడ పెద్ద చెరువులో 300 ఎకరాలు కబ్జా
  • గట్టి వాన పడితే పట్టణాలను ముంచెత్తుతున్న వరద
  • కబ్జాల విషయం తెలిసినా పట్టించుకోని ఆఫీసర్లు

చినుకు పడితే చాలు పట్టణాలు వణికిపోతున్నాయి. వాగుల ఎఫ్‌ఆర్‌ఎల్‌ పరిధిలో నిర్మాణాలు, నాలాల ఆక్రమణలు, చెరువుల కబ్జాలతో వరద నీరు పోటెత్తి కాలనీలకు కాలనీలే నీట మునుగుతున్నాయి. శనివారం రాత్రి, ఆదివారం కురిసిన వర్షానికి ఖమ్మం జిల్లా కేంద్రంతో పాటు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు, సూర్యాపేట జిల్లాలోని కోదాడ, వరంగల్‌ జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. కాలనీల్లోకి భారీ స్థాయిలో వరద చేరడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు. మరికొన్ని చోట్ల ఇండ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఇంతటి విపత్తుకు గల కారణాలు ఏంటని ఆఫీసర్లు అన్వేషించడంతో కొందరు లీడర్లు, రియల్టర్లు తమ స్వార్థం కోసం చెరువులు, నాలాలను ఆక్రమించేసి ఇష్టం వచ్చినట్లుగా నిర్మాణాలు చేపట్టడమే కారణమని తెలిసింది.

Also Read:-మంత్రులంతా ముంపు ప్రాంతాల్లోనే

సూర్యాపేట/ కోదాడ, వెలుగు: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ చరిత్రలోనే మొదటిసారిగా శనివారం రాత్రి వరద బీభత్సం సృష్టించింది. ఇందులో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా అనేక మంది నిరాశ్రయులయ్యారు. పట్టణంలో 40 చెరువులు, కుంటలు, వాగులు ఆక్రమణకు గురి కావడంతో వరద వెళ్లే మార్గం లేక జనావాసాలపై పడింది. దీంతో గత యాభై ఏండ్లలో ఎంత వర్షం పడినా ముంపునకు గురి కాని ప్రాంతాలు సైతం ప్రస్తుతం వరద నీటితో నిండిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రజలను బోట్ల ద్వారా తరలించే పరిస్థితి ఏర్పడింది. 

ఆక్రమణకు గురైన కోదాడ పెద్ద చెరువు

కోదాడకు ఉత్తరం వైపు పెద్ద 743 ఎకరాల్లో పెద్ద చెరువు విస్తరించి ఉండగా ఇందులో 300 ఎకరాలు కొందరు వ్యక్తులు కబ్జా చేసి ఇండ్లు నిర్మించారు. అలాగే తూర్పు వైపున ఎర్రకుంట చెరువు, శ్రీరంగాపురం వద్ద సాగి చెరువు వున్నాయి. కోదాడ సమీపంలోని బాలాజీనగర్‌‌‌‌ మేజర్‌‌‌‌ కాల్వ నుంచి తొండకుంట వాగు పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీ, ఆజాద్‌‌‌‌ నగర్‌‌‌‌ మీదుగా ఎర్రకుంట చెరువుకు, అక్కడి నుంచి కోదాడ పెద్ద చెరువుకు చేరేది. అయితే ఎర్రకుంట చెరువు పూర్తిగా ఆక్రమణకు గురైంది. పెద్ద చెరువులో ఆక్రమణలు పెరిగిపోవడంతో వరదనీరు వెనక్కి వచ్చి కాలనీలను ముంచెత్తుతోంది. శ్రీరంగాపురంలోని సాకి చెరువు, వరద కాల్వ కూడా ఆక్రమణకు గురికావడంతో ఆ నీరంతా జాతీయ రహదారిపైకి చేరుతోంది. కోదాడ పెద్ద చెరువు అలుగు నుంచి వచ్చే నీరు పొలాల మీదుగా ఖమ్మం రోడ్‌‌‌‌లోని వాగు ద్వారా చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లేది. ఇప్పుడు ఆ కాల్వను కూడా ఆక్రమించడంతో వరద నీరు వెళ్లేందుకు మార్గం లేకుండా పోయింది.

కోదాడలో అధ్వానంగా మారిన డ్రైనేజీ వ్యవస్థ

కోదాడ పట్టణంలో హైవే, ప్రధాన రహదారుల వెంట నిర్మించే భవనాలకు కనీస నిబంధనలు పాటించడం లేదు. మరో వైపు పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా మారింది. గతంలో రూ. 5 కోట్లు ఖర్చు చేసి పట్టణంలో జాతీయ రహదారి పొడవునా ఇరువైపులా డ్రైనేజీ నిర్మించాలు. కానీ మున్సిపల్‌‌‌‌ ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణం, నిర్వహణ లేని కారణంగా నీరంతా ఎక్కడికక్కడే నిలిచిపోతోంది. వరదలు వచ్చిన టైంలోనే స్పందించి డ్రైనేజీ పగులగొట్టి చెత్త చెదారాన్ని తొలగిస్తున్నారు. తర్వాత పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వాగు, నాలాలను ఆక్రమించి ఇండ్ల నిర్మాణాలు

ఖమ్మం, వెలుగు : ఖమ్మం నగరాన్ని ఆనుకుని ప్రవహించే మున్నేరుకు ఫస్ట్‌‌‌‌ టైం 38 అడుగుల మేర వరద వచ్చింది. ఈ ప్రవాహం సాఫీగా వెళ్లకుండా వాగును ఆక్రమిస్తూ పలు చోట్ల వెంచర్లు వెలిశాయి. నాయుడుపేట సమీపంలో వాగు ప్రవాహ పరిధిలోనే ఓ లీడర్‌‌‌‌ ఫంక్షన్‌‌‌‌ హాల్‌‌‌‌ నిర్మించారు. బీఆర్ఎస్‌‌‌‌ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ కార్పొరేటర్‌‌‌‌గా పనిచేసిన సదరు లీడర్‌‌‌‌ వాగులోనే ఫంక్షన్‌‌‌‌హాల్‌‌‌‌ను నిర్మించినా అప్పట్లో ఎవరూ చర్యలు తీసుకోలేదు. మరో వైపు వాగుకు రెండు వైపులా గత పదేండ్లలో అనేక వెంచర్లు వెలిశాయి.

ఖమ్మంలో కూడా లకారం చుట్టూ ట్యాంక్‌‌‌‌బండ్‌‌‌‌ నిర్మించడం, నాలాను ఆక్రమించి అపార్ట్‌‌‌‌మెంట్లు కట్టడం కవిరాజ్‌‌‌‌నగర్‌‌‌‌ మునకకు కారణమైంది. బల్లేపల్లి నుంచి న్యూ విజన్‌‌‌‌ స్కూల్‌‌‌‌ మీదుగా లకారం చెరువు అలుగు నుంచి దిగువకు వెళ్లాల్సిన వరద నీరు కాస్తా  వీధుల్లోకి వచ్చింది. ఎగువ నుంచి వచ్చిన వరద వెనుకకు పోటెత్తడంతో కవిరాజ్‌‌‌‌నగర్‌‌‌‌, పాత కలెక్టరేట్‌‌‌‌ వెనుక ప్రాంతాలు, చెరువు బజార్, చైతన్య నగర్, మైసమ్మ గుడి ప్రాంతాలు మునిగిపోయాయి. అధికార పార్టీకి చెందిన లీడర్లనో, మామూళ్లు ముట్టాయన్న కారణంతోనే అప్పట్లో అక్రమ నిర్మాణాలను ఆఫీసర్లు పట్టించుకోలేదు. ఆ ఎఫెక్టే ఇప్పుడు చూపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.