ప్రాణహిత వరదల్లో 30 వేల ఎకరాలకు నష్టం

  •     ప్రతిపాదనలు పంపించామంటున్న ఆఫీసర్లు
  •     స్పందించని సర్కార్.. ఆదుకోవాలని వేడుకుంటున్న రైతులు

ఆసిఫాబాద్,వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో  రెండేళ్లుగా భారీ వర్షాలు పత్తి రైతులను అతలాకుతలం చేశాయి. పెట్టిన పెట్టుబడి వరదలపాలైంది. పెద్ద వాగు ఉధృతంగా ప్రవహించడంతో సుమారు మూడు కిలో  మీటర్ల దూరంలోని చేలన్నీ చెరువులను తలపించాయి. వర్షాలు.. ప్రాణహిత వరదలతో సుమారు 30 వేల ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిన్నది. వేల ఎకరాల్లో ఇసుక మేటలు వేసింది. దీంతో రైతులు మళ్లీ విత్తనాలు వేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. దెబ్బతిన్న పంటల సర్వే చేసిన ఆఫీసర్లు నివేదికను ప్రభుత్వానికి సమర్పించినా ఇంతవరకు రైతులకు ఎలాంటి పరిహారం అందలేదు. 

ఇదీ పరిస్థితి..

భారీ వర్షాలు, వరదల కారణంగా రైతులు, కౌలు రైతులు పెట్టిన పెట్టుబడి చేతికందలేదు. వచ్చిన కొద్దో గొప్పో దిగుబడి అమ్మినా అప్పులు తీరలేదు. దీంతో చాలామంది రైతులు ఇల్లు గడవక ఇబ్బంది పడుతున్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో దహెగాం, బెజ్జుర్, కౌటాల, పెంచికల్ పేట, చింతలమానేపల్లి మండలాల్లో నష్టం ఎక్కువగా జరిగింది. చేలలో ఇసుక మేటలు వేయడంతో భూములు సాగుకు పనికిరాకుండా పోయాయి. మహారాష్ట్రాలో కురిసిన వర్షాలకు ప్రాజెక్టులన్నీ పొంగి ప్రవహించాయి.  సిర్పూర్ నియోజకవర్గం సరిహద్దులో ప్రవహిస్తున్న ప్రాణహిత నదికి వరద పోటెత్తింది.

బ్యాక్ వాటర్ తో బెజ్జూరు, పెంచికల్ పేట, చింతలమానేపల్లి, కౌటాల మండలాల్లో 2,900 ఎకరాల్లో పత్తి ,499 హెక్టార్లలో వరి నీట మునిగింది. అగ్రికల్చర్ ఆఫీసర్లు సర్వే చేసి గవర్నమెంట్ కు నివేదిక పంపినా ఇంతవరకు పరిహారం అందలేదు. ఆసిఫాబాద్​ నియోజకవర్గంలో వర్షాలు, వరదల కారణంగా దాదాపు 4 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వేలాది ఎకరాల్లో ఇసుక మేటలు వేసింది. ఏజెన్సీ ఏరియాలో వర్షం నీరు పొలాలు, చేలలో రోజుల తరబడి ఉండడంతో సుమారు 10 వేల ఎకరాల్లో పత్తి, సోయా మొక్కలు కుళ్లిపోయాయి. ఇసుక మేటలు వేయడంతో పొలాలు పనికిరాకుండా పోయాయి. గత ఏడాది వర్షాలు.. వరదల కారణంగా జిల్లా వ్యాప్తంగా దాదాపు 13 వేల ఎకరాల్లో నష్టపోయిన పంటలకూ పరిహారం ఇయ్యలేదు.

చేనంతా కొట్టుకుపోయింది

పెద్దవాగు వరదల చేనంతా కొట్టుకుపోయింది. నాలుగు ఎకరాల్లో ఒక్క మొలక కూడా లేకుండా పోయింది. రూ. 80 వేలు పెట్టుబడి నీళ్లపాలైంది. ఇసుక మేటలు వేయడంతో చేను పనికిరాకుండా పోయింది. - గౌరె లక్మాజి, రైతు, భ్రాహ్మన్ చిచ్చాల, దహెగాం

చాలా నష్టం జరిగింది..

నాలుగు ఎకరాల్లో పత్తి వేశాం. వానాకాలంలో పంట నీట మునిగింది. ఆఫీసర్లు సర్వే చేశారు.. తప్ప పరిహారం గురించి ఇప్పటి వరకు ఏంచెప్పలేదు. చేతిలో చిల్లిగవ్వలేక ఇబ్బంది పడుతున్నాం. పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. - వెంకటేశ్, రైతు, దిందా, చింతలమానేపల్లి