మహబూబ్‌నగర్/ వనపర్తి/ మక్తల్/నాగర్ కర్నూల్, వెలుగు : ఉమ్మడి జిల్లాలో బుధ, గురువారం ఎడతెరపిలేని వాన కురిసింది. దీంతో ఆయా ప్రాంతాలను వరద ముంచెత్తింది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎర్రగుంట, పెద్ద చెరువు అలుగు పారడంతో బీకే రెడ్డికాలనీ, శివశక్తినగర్, రామయ్యబౌలి, గణేశ్‌నగర్ ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఇండ్లలోకి నీరు చేరడంతో కాలనీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎర్రకుంట చెరువు అలుగు పారుతుండటంతో మహబూబ్‌నగర్–-రాయచూర్ అంతర్రాష్ర్ట రహదారిపై నీళ్లు పారుతున్నాయి. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న కోడూరు వద్ద పెద్దవాగు ఉధృతంగా పారుతోంది. రామచంద్రాపూర్‌లో కురిసిన వర్షానికి చెరువు పూర్తి గా నిండింది. వనపర్తి సమీపంలోని రోడ్డు కోతకు గురైంది. బ్రిడ్జి నిర్మిస్తున్న చోట తాత్కాలిక రోడ్డు వరదలో కొట్టుకు పోయింది.180 ఎకరాల ఆయకట్టు ఉన్న పెద్దమందడి మండలం దొడగుంటపల్లిలోని ఊర చెరువుకు గండిపడింది.దీంతో సుమారు వంద ఎకరాల పంటలు నీటమునిగాయి. ఆయా గ్రామాల్లో పత్తి పంట దెబ్బతిన్నది. మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం దొడగుంటపల్లి చెరువు ను సందర్శించారు. రైతులకు జరిగిన నష్టాన్ని తీరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మక్తల్ పట్టణంలోని ఎల్లమ్మకుంట, బసవేశ్వర కాలనీ, రహమానీయ కాలనీలు జలమయం అయ్యాయి. ఇండ్లలోకి నీళ్లు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షానికి అధికారులు నాగర్ కర్నూల్ వ్యాప్తంగా ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు.
అలర్ట్ గా ఉండాలి ..
గద్వాల: రెండు రోజుల నుంచి వానలు కురుస్తుండడంతో ప్రజలు అలర్ట్ గా ఉండాలని ఎస్పీ రంజన్ రతన్ కుమార్ సూచించారు. వాగులు, నదుల దగ్గర పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎమర్జెన్సీ టైంలో డయల్ 100కు, 9494921100 పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయాలన్నారు.
పెరిగిన ఫ్లో..
దేవరకద్ర/ మదనాపురం, వెలుగు: ఎడతెగని వర్షానికి కోయిల్‌సాగర్ కు వరద భారీగా వచ్చింది. దీంతో గురువారం ఉదయం గేట్లను 5 ఫీట్లు ఎత్తారు. ప్రాజెక్టులోకి ఇన్ ప్లో 3600 వేల క్యూసెక్కులు ఉండగా అవుట్‌ఫ్లో 3500 క్యూసెక్కులు ఉన్నట్టు అధికారులు చెప్పారు. అలాగే ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలద్వారా ఆయకట్టు రైతులకు నీటిని వదులుతున్నారు. మరోవైపు సరళ సాగర్ ప్రాజెక్టు భారీగా వరద రావడంతో తెల్లవారుజామున ఆటోమేటిక్ సైఫన్లు ఓపెన్ అయ్యాయి. మదనాపురం, ఆత్మకూరు ప్రధాన రహదారిపై రైల్వే గేట్ సమీపంలోని బ్రిడ్జి పై నుంచి భారీగా వరద ప్రవహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. వర్షాకాలంలో రెండు నెలల్లో ఎనిమిది సార్లు ఈ సైఫన్లు ఓపెన్ అయ్యాయి. వరద నీరు అంతా రామన్ పాడు ప్రాజెక్టుకు చేరుకోవడంతో రెండు గేట్లు ఎత్తి దిగువకు వదిలారు.
నాలాల ఆక్రమణల వల్లే..
మహబూబ్‌నగర్, వెలుగు : పాలమూరులో వంద ఫీట్ల నాలాను ఐదు ఫీట్లు మిగిలేలా ఆక్రమించడం వల్లే వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆయన గురువారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. గతంలో సర్వేలో 67 ఇండ్లు, బఫర్ జోన్లో 30 ఇండ్లు ఆక్రమణలు చేసి నిర్మించినట్లు అధికారులు తెలిపారని వెల్లడించారు. వచ్చే ఏడాది నాటికి ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. నీటి ప్రవాహానికి ఎక్కడెక్కడ అడ్డంకులున్నాయో డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించేలా అధికారులను ఆదేశించినట్లు మంత్రి వివరించారు. అనంతరం మంత్రి, కలెక్టర్ ఎస్.వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లుతో కలిపి ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు భోజనం ప్యాకెట్లను పంపిణీ చేశారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ఇరిగేషన్ ఇంజనీర్లు చక్రధరం, దయానంద్, మనోహర్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ ఉన్నారు.