- ఉమ్మడి మెదక్ జిల్లాలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు
- నిండుకుండలా ప్రాజెక్ట్లు
- అలుగుపారుతున్న చెరువులు, కుంటలు
మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు: ఈ వానకాలంలో జూన్, జూలై, ఆగస్టులో వర్షాభావ పరిస్థితులు నెలకొనగా రెండు రోజుల్లో కరువు తీరా వాన కురిసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. దీంతో చాలా వరకు చెరువులు, కుంటలు పూర్తిగా నిండి అలుగు పారుతుండగా ప్రాజెక్ట్ల్లోకి పెద్ద మొత్తంలో నీరు చేరింది. మెదక్ జిల్లాలోని 21 మండలాల్లో జూన్ ప్రారంభం నుంచి సెప్టెంబర్ 2 వరకు 11,528 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 14,854 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
జిల్లాలో సరాసరి 549 మిల్లీ మీటర్ల వర్షం పడాల్సి ఉండగా 707.3 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. అంటే సాధారణం కంటే 29 శాతం అదనంగా వర్షం కురిసింసి. మాసాయిపేట మండలంలో సాధారణం కంటే 60 శాతం అధికంగా, 14 మండలాల్లో 20 నుంచి 59 శాతం అధికంగా వర్షం కురిసింది. మిగితా 6 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. జిల్లాలో మొత్తం 2,694 చెరువులు ఉండగా 471 చెరువులు పూర్తిగా నిండి అలుగు పారుతున్నాయి. 831 చెరువుల్లో 75 నుంచి 100 శాతం నీరు చేరగా 931 చెరువుల్లో 50 నుంచి 75 శాతం, 461 చెరువుల్లో 25 నుంచి 50 శాతం నీరు చేరింది. కొల్చారం మండల పరిధిలోని వనదుర్గా ప్రాజెక్ట్ (ఘనపూర్ ఆనకట్ట) పూర్తిగా నిండి ఆనకట్ట పైనుంచి 30 వేల క్యూసెక్కుల నీరు పొంగిపొర్లుతోంది.
సిద్దిపేట జిల్లాలో..
సిద్దిపేట జిల్లాలో జూన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సరాసరి 472.4 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 727.3 వర్షం కురిసింది. సాధారణం కం53.9 శాతం అధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలో మొత్తం 26 మండలాలు ఉండగా 22 మండలాల్లో సాధారణం కంటే అధిక వర్ష పాతం నమోదు కాగా 4 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. జిల్లాలో చిన్నా పెద్ద కలిసి దాదాపు 2000 చెరువులు ఉండగా ప్రస్తుతం సగానికి పైగా చెరువులు నిండి ఆలుగు పారుతున్నాయి. జిల్లాలోని మోయ తుమ్మెద, కూడ వెళ్లి, హల్ది వాగు జలకళను సంతరించుకున్నాయి.
సంగారెడ్డి జిల్లాలో..
సంగారెడ్డి జిల్లాలో జూన్ నుంచి ఇప్పటి వరకు సరాసరి 515.6 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 625.4 మిలీ మీటర్ల వర్షం కురిసింది. సాధారణం కంటే 21 శాతం అధికంగా వర్ష పాతం నమోదైంది. జిల్లాలోని కొండాపూర్, చౌటకూర్ మండలాల్లో అత్యధికంగా, 11 మండలాల్లో సాధారణం కంటే అధిక వర్షం కురిసింది. మిగతా 15 మండలాల్లో సాధారణ వర్ష పాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 426 చెరువులు ఉండగా 411 చెరువులు పూర్తిగా నిండాయి. పుల్కల్ మండలం సింగూర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 29.917 టీఎంసీల సామర్థ్యం గల సింగూరు ప్రాజెక్టులో ప్రస్తుతం 18.903 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మంజీరా ప్రాజెక్టు సైతం నిండుకుండలా మారింది. నారింజ, నల్లవాగు ప్రాజెక్టులు సైతం వరద నీటితో నిండిపోయాయి. పుల్కల్ మండలం ఇసోజిపేట వద్ద సింగూరు కెనాల్ కు గండిపడి పంట పొలాల్లోకి నీరు వృథాగా పోతోంది.