- వేల్పూర్‌లో అత్యధికంగా 43 సెం.మీ నమోదు
- తెగిన రెండు చెరువు కట్టలు..గ్రామాల్లోకి వరద
- నీట మునిగిన 5,523 హెక్టార్ల పంటలు
- పాక్షికంగా దెబ్బతిన్న 73 ఇండ్లు
నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్ జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. గడిచిన 24గంటల్లో జిల్లాలో 28.2 సెంటీమీటర్ల రికార్డుస్థాయి భారీ వర్షం నమోదైంది. ఏకధాటిగా ఆరు గంటలపాటు వాన పడగా వాగులు, వంకలు, చెరువులు నిండిపోయాయి. గత వారం రోజులుగా కురిసిన వాన ఆదివారం ఒకరోజు గరువు ఇచ్చినట్టే ఇచ్చి సోమవారం రాత్రి నుంచి మళ్లీ స్పీడందుకుంది. ఈ సీజన్లోనే అత్యధిక వర్షం మంగళవారం నమోదైంది. వేల్పూర్మండలంలో 43 సెంటీమీటర్ల వాన పడింది. భీంగల్మండలంలో24.7, జక్రాన్ పల్లిలో 22.6 సె.మీ వర్షం నమోదైంది.
చెరువు నీరంతా ఊరిలోకి...
కుండపోత వాన కారణంగా వేల్పూర్ మండల కేంద్రంలోని ముసలిగుంట చెరువు కట్ట తెగింది. దీంతో చెరువు నీరు మొత్తం గ్రామంలోని వచ్చింది. పోలీస్ స్టేషన్, తహసీల్ఆఫీసు, పెట్రోల్ బంక్, వీడీసీ కాంప్లెక్స్, మదర్సా బిల్డింగ్చుట్టూ నీరు చేరింది. సెంట్రల్లైటింగ్ఏర్పాటు కోసం నిర్మించిన డివైడర్మీదుగా నీటి వరద ప్రవహిస్తోంది. పచ్చల నడ్కుడ గ్రామంలోని బుడగ చెరువు కోతకు గురై భీంగల్ రోడ్డు ఒక పక్క తెగిపోయింది. మామిడిపల్లి, పెర్కిట్, చేపూర్చెరువులు పూర్తిస్థాయిలో నిండాయి. వరద కారణంగా చేపూర్ వద్ద ఆర్మూర్–-జగిత్యాల హైవే తెగింది. ట్రాఫిక్పోలీసులు వాహనాల రాకపోకలు నియంత్రించారు.
నవీపేటలోని నాలేశ్వర్మాటు కాలువ రెండు చోట్ల, జన్నేపల్లి మాటు కాలువ ఓ చోట తెగిపోయాయి. జిల్లాలో మొత్తం1086 చెరువులు ఉండగా ఇప్పటి వరకు 263 చెరువులు పూర్తిగా నిండిపోయాయి. 543 చెరువుల్లోకి 75శాతానికి మించి నీరు చేరింది. నేడో రేపో అవి కూడా నిండనున్నాయి. 217 చెరువుల్లోకి 50శాతానికి మించి నీరు రాగా 8 చెరువుల్లోకి 40 శాతం నీరు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వానల ధాటికి 73 ఇండ్లకు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
ఎస్సారెస్పీకి మళ్లీ పెరిగిన వరద
ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి మంగళవారం సాయంత్రం 39,443 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. సోమవారం 9,861 క్యూసెక్కులు ఉన్న వరద మళ్లీ పెరుగుతోంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రికార్డుస్థాయిలో ఇన్‌ఫ్లో వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తి నీటి నిలువ 90.30 టీఎంసీలు కాగా ప్రస్తుతం 64.369 టీఎంసీలుగా ఉంది.
కామారెడ్డి జిల్లాలో...
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకు జోరు వాన కురిసింది. 24 గంటల్లో జిల్లాలో 4.6 సెం.మీ. సగటు వర్షపాతం నమోదైంది. మూడురోజులపాటు కురిసిన వానలు మంగళవారంతో జోరందుకున్నాయి. దీంతో వాగులు నిండుగా ప్రవహిస్తున్నాయి. గాంధారి, లింగంపేట మండలాల్లోని పంట పొలాల్లోకి నీరు చేరింది. కామారెడ్డి టౌన్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బంది కలిగింది. బాన్స్వాడలో 8సెం.మీ., గాంధారిలో7.2 సెం.మీ., తాడ్వాయిలో 6.2సెం.మీ., సదాశివనగర్‌లో6సెం.మీ., నస్రుల్లాబాద్, లింగంపేటలల్లో5.4సె.మీ.
చొప్పున, కామారెడ్డిలో 5.3సెం.మీ., నాగిరెడ్డిపేటలో5.1సెం.మీ., రాజంపేటలో5సెం.మీ., మాచారెడ్డిలో4.8సెం.మీ., పాల్వంచలో4.6సెం.మీ., భిక్కనూరులో 4.5సెం.మీ., ఎల్లారెడ్డిలో4.3సెం.మీ., బీబీపేటలో4.1సెం.మీ., బిచ్కుందలో3.9సెం.మీ., పిట్లంలో3.4సెం.మీ. వర్షపాతం నమోదైంది.
ALSO READ :జూన్ క్వార్టర్‌లో .. సైయంట్ లాభం అప్
90శాతం వరిపైనే ప్రభావం...
కుంభవృష్టి కారణంగా పంటలపై కూడా ప్రభావం పండింది. జిల్లాలో మంగళవారం సాయంత్రానికి 5,523 హెక్టర్లలో పంటలు నీటమునిగినట్టు అగ్రికల్చర్ఆఫీసర్లు గుర్తించారు. ఇందులో వరి 90 శాతం ఉందని వారు నిర్ధారించారు. ఈ పరిస్థితి వేల్పూర్మండలంలో ఎక్కువ ఉంది. 4,908 మంది రైతులు నష్ట పోయినట్టు వారు వెల్లడించారు. వానల ధాటికి జిల్లాలో 16 కరెంట్ట్రాన్స్ఫారాలు పడిపోయాయి. కాగా వాటికి యుద్ధ ప్రాతిపదికన రిపేర్లు చేస్తున్నారు. 11కేవీ స్తంభాలు 480, ఎల్ టీ లైన్‌కు చెందిన 863 స్తంభాలు ప్రమాదకరంగా మారడంతో తక్షణం మార్చారు. రోజంతా కరెంట్సప్లై తీసేసి రిపేర్లు చేశారు.