ఉత్తరాదిలో భారీ వర్షాలు..తొమ్మిది రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ 

ఉత్తరాదిలో భారీ వర్షాలు..తొమ్మిది రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ 

ఉత్తర భారత దేశంలో భారీవర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆదివారం (జూన్ 30)  ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ ఆలయం సమీపంలో హిమపాతం సంభవిం చింది. ఆలయం వెనక భాగంలో ఉన్న కొండపై తెల్లవారు జామున 5 గంటలకు గాంధీ సరోవర్ మీదుగా మంచు చరియలు విరిగి పడ్డాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. శనివారం కూడా ఉత్తరా ఖండ్ లోని హరిద్వార్ లో గంగా నది నీటిమట్టం పెరగడంతో ఎనిమిది వాహనాలు కొట్టుకుపోయాయి. 

జార్ఖండ్ లోని గిరిధహ్ జిల్లాలో కురిసిన వర్షాలకు ఆదివారం నిర్మాణంలో  ఉన్న వంతెన కూలిపోయింది. డియోరీ బ్లాక్ లో ఆర్గా నదిపై ఈ వంతెనను రూ. 5.5 కోట్లతో నిర్మిస్తున్నారు. శనివారం కురిసిన వర్షాలకు నదీ ప్రవాహం పెరగడంతో బ్రిడ్జీ ప్రహారీ విరిగి కొట్టుకుపోయింది. 

 రానున్న రోజుల్లో ఉత్తరాదిన భారీ నుంచి అతి భారీ వర్షాలకు కురిసే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరికలు జారీ చేసింది. యూపీ, ఉత్తరాఖండ్, హిమాచల్, పంజా బ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ , మహారాష్ట్రలో జూలై 2 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 

అరుణాచల్ ప్రదేశ్ లో రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో ఈ రోజు నుంచి జూలై 3 వరకు 64.5 నుంచి 204.4 మి.మీ. వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.