శ్రీశైలం.. మహా శివుడు కొలువైన క్షేత్రం.. కనీవినీ ఎరుగని స్థాయిలో.. శ్రీశైలం చరిత్రలోనే కుండపోత వర్షం పడింది. శ్రీశైలం పుణ్యక్షేత్రం రోడ్లు అన్నీ నదుల్లా మారాయి.. నీళ్ల ప్రవాహానికి బండ్లు కొట్టుకుపోయాయి.. నీటి ఉధృతికి శ్రీశైలం వాసులు, భక్తులు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లల్లోకి నీళ్లు వచ్చాయి.. దుకాణాలు మునిగిపోయాయి.. బ్యాంకులు తడిసిపోయాయి.. శ్రీశైలంలో కుండపోత కాదు.. కుంభవృష్టిగా పడింది వాన. మంగళవారం ( ఆగస్టు 20, 2024 ) రాత్రి కురిసిన కుంభవృష్టి వర్షానికి కొండ చరియలు వర్షపు నీటికి తడిసి ముద్దయ్యాయి, కొండ చరియలు విరిగి పెద్ద పెద్ద బండరాళ్లు తెలంగాణ,ఆంధ్రని కలిపే రహదారిపై పడ్డాయి.
జలాశయం దిగువన రహదారి మార్గంలో రోడ్డుకు అడ్డంగా కొండ చరియలు విరిగిపడడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే కొండ చరియలు రాత్రి సమయానికి విరిగి పడడంతో రాత్రి వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి. రోడ్డుపై పడ్డ కొండ చరియల బండరాళ్లను త్వరగా తొలగించి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు.
గతంలో కూడా పలుమార్లు వర్షాకాలంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. తరచూ కొండ చర్యలు విరిగి పడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. రాత్రి సమయంలో ప్రయాణం చేసే సమయానికి కొండ చర్యలు విరిగిపడితే పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు ప్రయాణికులు. అధికారుల తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.