వెయ్యికి పైగా స్కూళ్లపైవర్షం ఎఫెక్ట్

  • రూ.20 కోట్ల వరకు నష్టం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల ప్రభావం సర్కారు స్కూళ్లపైనా పడింది. పలు జిల్లాల్లో బడులన్నీ వరద నీటితో నిండిపోయాయి. దీంతో స్కూళ్లలోని కంప్యూటర్లు, మిడ్​ డే మీల్స్ బియ్యం, రికార్డులు నీళ్లలో తడిసిపోయాయి. కుండపోత వర్షాలతో పాటు భారీ వరదలతో వందలాది బడులు బురదమయంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలకు ఎఫెక్ట్ అయిన స్కూళ్ల వివరాలను సేకరించి, తద్వారా జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రాథమిక అంచనా ప్రకారం 28 జిల్లాల్లో వెయ్యికి పైగా బడులు భారీ వర్షాలకు ఎఫెక్ట్ అయ్యాయని గుర్తించారు. అత్యధికంగా నిర్మల్, మహబూబాబాద్, గద్వాల, ఖమ్మం తదితర జిల్లాల్లో ఎక్కువగా నష్టం జరిగిందని.. రాష్ట్రవ్యాప్తంగా రూ.20 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. పలు స్కూళ్లలో కిచెన్ షెడ్లు, ప్రహరీలు కూలిపోగా.. చాలాచోట్లా స్టోర్ రూమ్స్, ఆఫీసు రూములు, క్లాస్ రూముల్లోకి వరద నీరు చేరింది.

దీంతో ఆయా రూముల్లోని ఫర్నీచర్ తో పాటు కంప్యూటర్లు, సీపీయూలు, బియ్యం ఇతర వస్తువులు తడిసిపోయాయి. పలు స్కూళ్లలోని టీచర్లు, స్టూడెంట్ల రికార్డులు, ఫైల్స్ నీట మునిగిపోయాయి. కొన్ని బడుల్లో పైకప్పులు కురుస్తున్నాయి.స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఇప్పటికే ప్రైమరీ రిపోర్టును సర్కారుకు పంపించారు. ఎంఈఓల ద్వారా మరోసారి వివరాలు తీసుకుంటున్నారు.