సెప్టెంబర్ 23, 24, 25 తేదీల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం(సెప్టెంబర్ 21) ఆసిఫాబాద్‌లో భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సిర్పూర్(టీ)లో 11.3 సెం.మీ వర్షపాతం కురిసింది. ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్, ములుగు, వరంగల్, హనుమకొండ, కరీంనగర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో నిన్న(సెప్టెంబర్ 21) రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాత్రి కురిసిన వర్షానికి భూపాలపల్లి ఓపెన్ కాస్ట్ గనుల్లో వర్షపు నీళ్లు నిలిచిపోయాయి. దీంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది.
అటు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పణ పల్లి శివారులో బ్రిడ్జిపై నుండి వట్టి వాగు ఉదృత్తంగా ప్రవహిస్తుంది. ఈ కారణంగా కేసముద్రం గూడూరు ప్రాంతాలకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో సాగుకు మేలు జరుగుతుంది. వరి, పత్తి , మొక్క జొన్న, మిర్చి పంటలకు సాగునీరు అందుతుంది.
Also Read :- హైదరాబాద్ లో కుండపోత వాన.. సెప్టెంబర్ 28 వరకు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని కొన్ని జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, కరీంనగర్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల, ఆదిలాబాద్, మంచిర్యాల, నల్గొండ, పెద్దపల్లి జిల్లాలో వర్షం కురుస్తుంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.