గ్రేటర్ సిటీతోపాటు శివారులో మంగళవారం వర్షం దంచికొట్టింది. పగలంతా సూర్యుడు తన ప్రతాపం చూపించగా, సాయంత్రం 4 గంటల తర్వాత నల్లటి మేఘాలు సిటీని కమ్మేశాయి. చినుకులతో మొదలై ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఎండలు, ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న జనానికి ఉపశమనం లభించింది. అయితే వాన మొదలవగానే కరెంట్ సరఫరా నిలిచిపోయి జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఐటీ కారిడార్లో వడగండ్ల వాన పడింది. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే టైంలో వర్షం మొదలవడంతో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఐటీ కారిడార్ లో సాయంత్రం 5 గంటలకు ఆఫీసుల నుంచి బయలుదేరిన ఉద్యోగులు రాత్రి 9 గంటలకు కూడా ఇండ్లకు చేరుకోలేదు. హైటెక్ సిటీకి నలువైపులా రోడ్లపై భారీగా ట్రాఫిక్ నిలిచింది. డీఆర్ఎఫ్ టీమ్స్ రంగంలోకి సహాయక చర్యలు చేపట్టాయి. 74 ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు నిలిచినట్లు బల్దియా అధికారులు తెలిపారు. ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు.
సహాయం కోసం జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ 040–21111111, 9000113667 నంబర్లకు కాల్ చేయొచ్చన్నారు. బుధవారం సిటీలో ఈదురు గాలులు వీయొచ్చని, గురువారం భారీ వర్షం(6.4 సెం.మీ నుంచి11.5 సెం.మీ)కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. – వెలుగు, సిటీ నెట్వర్క్