- పిడుగుపాటుతో ముగ్గురు మృతి, నలుగురికి గాయాలు
- వడ్ల కుప్పల వద్ద తాతామనుమళ్లపై.. నర్సరీ వద్ద కూర్చున్నోళ్లపై పడ్డ పిడుగులు
- వర్షంతో పలుచోట్ల పోలింగ్ సిబ్బందికి ఇబ్బందులు
- వారం పాటు వర్షాలుంటాయన్న ఐఎండీ.. ఎల్లో అలర్ట్ జారీ
- వడ్లు తడిసినా కొనండి.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
- ఆందోళన వద్దు.. అండగా ఉంటామని రైతులకు హామీ
ఈదురుగాలుల బీభత్సానికి పలుచోట్ల చెట్లు, కరెంట్ పోల్స్ నేలకొరిగాయి. వర్షాలతో పలు జిల్లాల్లో ఆరబోసిన వడ్లు తడిసిపోయాయి. సంగారెడ్డి, కుమ్రంభీం తదితర జిల్లాల్లో వర్షాల వల్ల పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో ఇబ్బందులు తలెత్తాయి. టెంట్లు కూలి, నీళ్లు నిలిచిపోవడంతో సిబ్బంది తిప్పలు పడ్డారు.
పిడుగులు పడి ముగ్గురు మృతి
రెండు జిల్లాల్లో పిడుగుపాటుతో ముగ్గురు చనిపోయారు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం రామోజీపల్లిలోని ఐకేపీ సెంటర్ లో వడ్ల కుప్ప మీద కవర్లు కప్పుతుండగా పిడుగుపడి తాతామనవళ్లు పాల్వంచ శ్రీరాములు(51), విశాల్(11) మృతిచెందారు. ఉరుములు, మెరుపులతో వర్షం స్టార్ట్ అవడంతో చెట్ల కిందకు వెళ్లడం ప్రమాదమని భావించిన వారిద్దరూ వడ్ల కుప్ప దగ్గరే సంచులు కప్పుకుని కూర్చున్నారు.
కానీ అక్కడే పిడుగు పడటంతో ఇద్దరూ చనిపోయారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం గిమ్మ గ్రామంలో నర్సరీ వద్ద కూర్చున్న ఐదుగురిపై పిడుగు పడింది. మామిడిపల్లి కిరణ్(43) అనే వ్యక్తి చనిపోయాడు. భోజన్న, సంటెన్న, కొండా రమేశ్, టిల్లూ అనే నలుగురు గాయపడగా, వారిని ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న పరామర్శించారు.
తడిసిన వడ్లు
అకాల వర్షానికి చేతికొచ్చిన పంటలు తడిసి ముద్దయ్యాయి. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, మాచారెడ్డి, పాల్వంచ, భిక్కనూరు, లింగంపేట, దోమకొండ, బీబీపేట, గాంధారి, రామారెడ్డి, తాడ్వాయి, రాజంపేట మండలాల్లో ఆరబోసిన వడ్లు తడిసిపోయాయి. ఈదురుగాలుల ధాటికి జిల్లాలోని మాచారెడ్డి మండలం మైసమ్మచెరువు తండాలో ఇండ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. ఆసిఫాబాద్ జిల్లాలోనూ వర్షాలకు పంటలు తడిశాయి. జిల్లా కేంద్రంలో చెట్లు నేలకొరిగాయి.
విద్యుత్ వైర్లు తెగి కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జిల్లా కేంద్రంలోని పీటీజీ స్కూల్ లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రంలో టెంట్లు ఈదురుగాలులకు కూలిపోయాయి. దీంతో సిబ్బంది హాస్టల్లోకి వెళ్లారు. ఆసిఫాబాద్ మండలం గుండి పెద్ద వాగుపై వేసిన తాత్కాలిక వంతెన భారీ వర్షానికి తెగిపోయింది. కాగజ్‌నగర్ డివిజన్లో వర్షంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. పలు చోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద వేసిన టెంట్లు కూలిపోయాయి.
నాగల్ గిద్దలో 5.1 సెం.మీ. వర్షం
సంగారెడ్డి జిల్లా నాగల్గిద్దలో 5.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా పాతరాజంపేటలో 4.5, ఆదిలాబాద్ జిల్లా పిప్పల్ ధారిలో 3.4, కామారెడ్డి జిల్లా రామలక్ష్మణపల్లిలో 3.3, సూర్యాపేట జిల్లా లక్కవరం, సంగారెడ్డి జిల్లా మొగ్దాంపల్లిలో 3, ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌లో 2.7, కామారెడ్డి జిల్లా వేల్పుగొండలో 2.6, దోమకొండలో 2.1, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంకంపల్లిలో 2.1, మెదక్ జిల్లా లింగాయపల్లిలో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. మరికొన్ని చోట్ల 2 సెంటీమీటర్ల కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది.
మరో వారంపాటు వానలు
రాష్ట్రంలో మరో వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆదివారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, మరఠ్వాడా, ఇంటీరియర్ కర్నాటక, తమిళనాడు మీదుగా కొమొరిన్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నదని,
దాని ప్రభావంతోనే వర్షాలు పడతాయని తెలిపింది. రాష్ట్రంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
వడదెబ్బతో నలుగురు మృతి
రాష్ట్రంలోని పలు చోట్ల ఎండ తీవ్రత కొనసాగు తోంది. ఆదివారం ఎండల తీవ్రతతో వడదెబ్బ బారినపడి నలుగురు మృతి చెందారు. జయ శంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లికి చెందిన వెల్దండి తిరుపతయ్య, చెక్క సుగుణమ్మ, ముల కలపల్లికి చెందిన ఓనపాకల మీసాల భద్రయ్య అనే ముగ్గురు వడదెబ్బతో అస్వస్థతకు గురై చనిపోయారు. రెండు రోజుల క్రితం వడదెబ్బకు గురైన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టుకు చెందిన కనుకుట్ల రాధ(40) ఆదివారం ఇంటి వద్దే చికిత్స పొందుతూ మృతి చెందింది.
కాగా, ఆదివారం ఏడు జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా, మిగతా జిల్లాల్లో ఆలోపే టెంపరేచర్లు నమోదయ్యాయి. అత్యధికంగా పెద్దపల్లి జిల్లా సుగ్లాంపల్లిలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడిచర్లలో 42.5 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 42.4, మంచిర్యాల జిల్లా కొమ్మెరలో 42.2, ములుగు జిల్లా మేడారంలో 42.2, కుమ్రంభీం జిల్లా కాగజ్‌నగర్‌లో 42.1, కరీంనగర్ జిల్లా వీణవంకలో 42 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు రికార్డ్ అయ్యాయి.
వడ్లు తడిసినా కొంటాం: సీఎం
రాష్ట్రంలో వర్షాల పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. వర్షాలకు వడ్లు తడిసినా రైతులు ఆందోళన చెందవద్దని, కచ్చితంగా ఆ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డితో పాటు పలు జిల్లాల్లో గాలివాన, పిడుగులు పడి సంభవించిన నష్టంపై సీఎం ఆరా తీశారు. భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.. ఆయా జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు అలర్ట్‌గా ఉండాలని ఆదేశించారు.
ఎక్కడ ఎలాంటి ఆపద వచ్చినా సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టాలన్నారు. పిడుగురు పడి ముగ్గురు చనిపోవడంపై సీఎం విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలను ఆదుకుంటామన్నారు. పిడుగుపాటుకు గాయపడిన వారికి తగిన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.