తెలంగాణపై తుఫాన్ ఎఫెక్ట్ .. 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణపై తుఫాన్ ఎఫెక్ట్ .. 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
  • రాష్ట్రంపై తుఫాన్ ఎఫెక్ట్
  • రోజంతా మబ్బులు.. పలుచోట్ల వర్షాలు

హైదరాబాద్, వెలుగు:ఫెయింజల్ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం మారిపోయింది. ఉత్తరాదితో పాటు దక్షిణాదిలోని పలు జిల్లాలను మబ్బులు కమ్మేశాయి. రాష్ట్రంలో పలుచోట్ల ఆదివారం ఉదయం నుంచే చిరుజల్లులు కురిశాయి. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రికొత్తగూడెం, హైదరాబాద్​లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, నాగర్​కర్నూల్ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి.

సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వులో 1.5 సెంటీ మీటర్లు, చిలుకూరులో 1.3, ఖమ్మం జిల్లా వైరాలో 1.3, సూర్యాపేట జిల్లా కీతవారిగూడెంలో 1.2 సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఇటు హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి మబ్బు పట్టి ఉండగా.. సాయంత్రం కొన్ని చోట్ల తేలికపాటి చిరుజల్లులు కురిశాయి. మల్కాజిగిరి, ఉప్పల్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ పరిధిల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. 

సోమవారం కూడా ఇదే పరిస్థితి ఉంటదని వాతావరణ శాఖ తెలిపింది. జయశంకర్​భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొన్నది. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్​ను జారీ చేసింది. తుఫాను కారణంగా రాష్ట్రంలో చలి తగ్గింది. ఆదిలాబాద్​లో అత్యల్పంగా 14.6 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. మిగిలిన జిల్లాల్లో 15.9 డిగ్రీల నుంచి 21.4 డిగ్రీల మధ్య రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

తీరం దాటిన తుఫాను

ఫెయింజల్ తుఫాను పుదుచ్చేరి సమీపంలో తీరం దాటినట్టు ఐఎండీ ప్రకటించింది. ప్రస్తుతం అది తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని వెల్లడించింది. తుఫాను ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాపై తుఫాను ప్రభావం ఎక్కువగా ఉందని అధికారులు చెప్తున్నారు. 

తుఫాను ప్రభావంతో ప్రకాశం జిల్లా కొత్తపట్నం తీరంలో సముద్రం 20 మీటర్లు ముందుకొచ్చింది. తిరుమల కొండపై వర్షం పడడం.. చలికాలం కావడంతో పొగమంచు దట్టంగా అలముకున్నది. వర్షంతో పాటు అక్కడ చలి తీవ్రత కూడా పెరిగింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్​రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి.