- తెగిన చెరువులు, కుంటలు.. కొట్టుకుపోయిన రోడ్లు
- నీట మునిగిన ఊర్లు.. జలమయమైన కాలనీలు
- విరిగిన చెట్లు, స్తంభాలు.. తెగిపడిన కరెంట్ తీగలు
- కూలిన వెయ్యికిపైగా ఇండ్లు.. 20 మందికిపైగా మృతి
- పునరావాస కేంద్రాలకు 5 వేల మంది తరలింపు
హైదరాబాద్/నెట్వర్క్, వెలుగు: భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే రూ.5,438 కోట్ల నష్టాన్ని మిగిల్చాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. వరదల కారణంగా ఇప్పటివరకు 20 మందికిపైగా మృతి చెందినట్లు సర్కారుకు సమాచారం అందింది. వరదలతో నిరాశ్రయులైన 5,774 మందిని పునరావాస కేంద్రాలకు ప్రభుత్వం తరలించింది. పలు జిల్లాల్లో వానలు, వరదలు పెను బీభత్సం సృష్టించాయి. మహబూబాబాద్, ఇతర జిల్లాల్లో రోడ్లు నామరూపాల్లేకుండా కొట్టుకుపోయాయి. చెరువులకు గండ్లు పడి, ఆ నీళ్లు వాగుల్లో చేరి వంతెనలు తెగిపోయాయి.
వందల కిలోమీటర్ల మేర ఆర్అండ్బీ రోడ్లు ధ్వంసమయ్యాయి. వీటి రిపేర్లకు రూ.2,362 కోట్లు, వంతెనల రిపేర్లకు మరో రూ.629 కోట్లు అవసరమని ఆ శాఖ అంచనా వేసింది. వరదలకు దెబ్బతిన్న పంచాయతీరాజ్ రోడ్లు, మిషన్‌భగీరథ పైపులైన్ల రిపేర్లకు రూ.170 కోట్లు అవసరమని ఆ శాఖ అధికారులు అంచనా వేశారు.
కరెంట్ స్తంభాలు కూలడం, వైర్లు తెగిపడడం, విద్యుత్ సబ్‌స్టేషన్లలోకి నీళ్లు చేరడంతో ట్రాన్స్‌కోకు కూడా భారీ నష్టం వాటిల్లింది. రిపేర్లకు రూ.175 కోట్లు అవసరమని ఆ శాఖ తేల్చింది. ఇక ఇప్పటివరకు సుమారు 4.15 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఎకరాకు కనీసం రూ.10 వేల చొప్పున పరిహారం ఇవ్వాలన్నా రూ. 415 కోట్లు కావాలని వ్యవసాయశాఖ అంచనా వేసింది.
వెయ్యికి పైగా ఇండ్లు కూలినయ్
వైద్య, ఆరోగ్య శాఖకురూ.12 కోట్ల నష్టం జరిగినట్టు అంచనా వేశారు. లైట్లు, వాటర్ పైప్‌లు, డ్రైనేజీ, ఇతరత్రా నష్టం రూ.1,150 కోట్ల దాకా ఉన్నట్లు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ సర్కారుకు నివేదించింది. ఇతర శాఖల నష్టాలు సైతం రూ.500 కోట్ల మేర ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
వరదలు, వర్షాలు తగ్గుముఖం పడితేనే పూర్తిస్థాయి నష్టం ఎంత అనేది తెలుస్తుందని ఆఫీసర్లు చెబుతున్నారు. అయితే, వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా స్పందించడంతో భారీ ప్రాణ, ఆస్తి నష్టం తప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికి పైగా ఇండ్లు కూలిపోగా, మరో 2 వేలకు పైగా ఇండ్లు దెబ్బతిన్నట్లు సర్కారుకు రిపోర్టులు అందాయి. .
కి.మీ. మేర కొట్టుకుపోయిన హైవే
భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లాలో 25 చెరువులు, కుంటలు తెగిపోవడం, ఆకేరు, పాలేరు, మున్నేరు వాగులు ఉధృతంగా ప్రవహించడంతో చాలాచోట్ల రోడ్లు, రైల్వే ట్రాక్‌లు ధ్వంసమయ్యాయి. కేసముద్ర మండలం తాళ్లపూసపల్లి, ఇంటికన్నె వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపడ్తున్నారు.
మరిపెడ మండలం పురుషోత్తమగూడెం వద్ద వరద ఉధృతికి 365 నేషనల్ హైవే కిలోమీటర్ మేర కొట్టుకుపోయింది. ఇక్కడ రోడ్డు రూపురేఖలు లేకుండా ధ్వంసమైంది. హైలెవల్‌వంతెన, రోడ్డుకు మధ్య కనెక్టివిటి తెగి, ఖమ్మం వైపు రాకపోకలు నిలిచిపోయాయి. డోర్నకల్ మండలం ముల్కలపల్లి నుంచి ఖమ్మం వెళ్లే రోడ్డులో, తొర్రూరు- నుంచి నర్సంపేట వెళ్లే రోడ్డులో రవాణా స్తంభించింది.
విజయవాడ హైవే పునరుద్ధరణ
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం వద్ద హైదరాబాద్– విజయవాడ హైవే కోతకు గురికావడం, జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద పాలేరు బ్రిడ్జిని వరద నీరు ముంచెత్తడంతో ఆదివారం తెలంగాణ, ఏపీ మధ్య ఇరువైపులా వేలాది వాహనాలు నిలిచిపోయాయి. సోమవారం సాయంత్రం కల్లా అధికారులు హైవేపై రాకపోకలను పునరుద్ధరించారు.
మహారాష్ట్రకు రాకపోకలు బంద్
కుమ్రంభీం జిల్లాలో హుడికిలి గ్రామం వద్ద తెలంగాణ-- మహారాష్ట్ర నేషనల్హైవే పైకి పెనుగంగా నది బ్యాక్ వాటర్ వచ్చి చేరడంతో మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఆనంద్ పూర్ గ్రామం వద్ద పెన్ గాంగా నది బ్రిడ్జిపై వరద నీరు ప్రవహించడంతో మహారాష్ట్రలోని దిగ్రస్, ఆనంద్ పూర్ గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి.
పాక్షికంగా ధ్వంసమైన బ్రిడ్జి
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పసర- తాడ్వాయి మధ్య జలగలంచ సమీపంలో వాగుపై బ్రిడ్జి పాక్షికంగా ధ్వంసమైంది. దీంతో జాతీయ రహదారిపై రాకపోకలు బందయ్యాయి. ప్రాజెక్టు నగర్– మేడారం మధ్యలో జంపన్న వాగు ఉధృతికి రోడ్డుపై నీళ్లు చేరడంతో ఆయా గ్రామాలకు రవాణా స్తంభించింది. దీంతో ఈ రెండు రోడ్లను తాత్కాలిక మరమ్మతులు చేసి, రాకపోకలు పునరుద్ధరించారు.
కొట్టుకుపోయిన నేషనల్ హైవే
మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం ఇబ్రహీంబాద్ వద్ద మహబూబ్‌నగర్- చించోలి నేషనల్ హైవే167 వరద ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో కోస్గి, కొడంగల్, తాండూరు, పరిగి ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయ మార్గాల నుంచి వాహనాలను మళ్లిస్తున్నారు.
పునరావాస కేంద్రాలకు 5,774 మంది
రాష్ట్రవ్యాప్తంగా వరదల్లో చిక్కుకొని నిరాశ్రయులైన 5,774 మందిని సర్కారు పునరావాస కేంద్రాలకు తరలించింది. బాధితులకు ఆహారం, నీళ్లు, వసతి సౌకర్యం కల్పించింది. సూర్యాపేట జిల్లాలో 7 షెల్టర్హోమ్స్ఏర్పాటుచేసి 2 వేల మందిని తరలించారు. ములుగు జిల్లాలో 9 పునరావాస కేంద్రాలకు 782 మందిని తరలించి ఆశ్రయం కల్పిస్తున్నారు. మహబూబ్‌నగర్‌లో పలు కాలనీలు జలమయం అయ్యాయి. జడ్చర్లలో నీట మునిగిన లోతట్టు కాలనీలకు చెందిన 21 కుటుంబాలను కమిటీ హాల్‌కు తరలించారు. నిర్మల్ జీఎన్ఆర్ కాలనీ నుంచి 42 కుటుంబాలను, కామారెడ్డి జీఆర్ కాలనీ నుంచి 60 మందిని షెల్టర్హోమ్స్కు తరలించారు.
భిక్కనూరు మండలం రామేశ్వర్పల్లిలో చెరువు పక్కనున్న డబుల్ బెడ్రూం కాలనీ నుంచి 45 మంది స్థానిక స్కూల్లోని షెల్టర్‌కు తీసుకెళ్లారు. నిజామాబాద్ సిటీలో 13, బోధన్ టౌన్ లో 4, ఆర్మూర్ లో 6, భీంగల్ మున్సిపాలిటీలో 5 కాలనీలు నీట మునగడంతో పలువురిని షెల్టర్హోమ్స్కు తరలించారు. మహబూబాబాద్ జిల్లాలో ఆకేరు వాగు వరదలో చిక్కుకున్న సీతారామ్ నాయక్ తండాలోని100 మందిని రైతు వేదికకు తరలించి పునరావాసం కల్పించారు.