తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి సెప్టెంబర్ 12వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాల నుంచి భారీ వానలు పడతాయని పేర్కొంది.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని..అటు వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో సెప్టెంబర్ 09, 10వ తేదీల్లో పలు జిల్లాల్లో.. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
రానున్న నాలుగు రోజుల పాటు ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. మరోవైపు ఈసారి ముందస్తుగానే ఈశాన్య రుతుపవనాల రాక మొదలు కావొచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది.