- గట్టి వానొస్తే .. మునుగుడే!
- రాష్ట్రంలో సగానికిపైగా సిటీల్లో ఇదే దుస్థితి
- ఎక్కడికక్కడ కాల్వలు, కుంటలు కబ్జా
- ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా వెలుస్తున్న కట్టడాలు
- అడ్డుకోవాలని సర్కారుకు ఐదుసార్లు ఆఫీసర్ల రిపోర్టు
- పట్టించుకోని ప్రభుత్వం.. న్యూయార్క్, డల్లాస్ మోడల్ అభివృద్ధి మాటలకే పరిమితం
హైదరాబాద్, వెలుగు: అద్ద గంట, ఒక గంట గట్టి వాన పడితే చాలు గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ సహా రాష్ట్రంలోని సగానికిపైగా సిటీలు గజగజ వణికిపోతున్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు నరకం అనుభవిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు భయం భయంగా గడుపుతున్నారు. వర్షపు నీరు వెళ్లేందుకు దారి లేక రోడ్లపై మోకాళ్ల లోతు మేర వరద నిలిచిపోతున్నది. దీనికి కారణం.. సరైన పట్టణ ప్రణాళిక అమలు కాకపోవడమేనని ఆఫీసర్లు చెప్తున్నారు. చెరువుల ఎఫ్ టీఎల్, వరద కాల్వల ప్రాంతాలను కబ్జా చేసి, వాటిని డెవలప్మెంట్ ఏరియాలుగా మార్చడంతోనే సమస్య వస్తున్నదని ఇప్పటికే ఐదుసార్లు ప్రభుత్వానికి అధికారులు రిపోర్టులు ఇచ్చారు. ప్రణాళిక ప్రకారం డెవలప్మెంట్ జరిగేలా మాస్టర్ ప్లాన్లు తీసుకొచ్చి, అమలు చేస్తేనే ముంపు నుంచి గట్టెక్కవచ్చని ప్రపోజల్స్ పంపారు. కానీ, వాటిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. లీడర్లకు మేలు చేసేలా మాస్టర్ ప్లాన్ల డ్రాప్ట్స్ ఉన్నాయని, వాటి వల్ల తమ భూములను పోతున్నాయని గత డిసెంబర్లో కొన్నిచోట్ల రైతులు ఆందోళనలకు దిగారు. దీంతో ఆ మాస్టర్ ప్లాన్లను మార్చి అమలు చేయాల్సిన ప్రభుత్వం.. పూర్తిగా అటకెక్కించింది.
చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు ఎటుపాయె?
గతంలో రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లో పర్యటించినప్పుడు సీఎం కేసీఆర్ ఆయా పట్టణాలను.. ఇస్తాంబుల్, న్యూయార్క్, డల్లాస్ లెక్క అభివృద్ధి చేస్తామని హామీలు ఇచ్చారు. హైదరాబాద్ వంటి నగరాలు మునగడానికి గత పాలకులే కారణమని పలుసార్లు ఆరోపించారు. తాము పక్కాగా ప్రణాళికలను అమలు చేస్తామని, కాలనీలు నీట మునగకుండా చూస్తామని మాటిచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చి తొమ్మిదేండ్లు దాటినా కేసీఆర్ మాటలు, హామీలూ అమలు కావడం లేదు. రాష్ట్రంలో మొత్తం 128 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లు ఉన్నాయి. సగానికిపైగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గట్టివాన పడితే ముంపు సమస్యను ఎదుర్కొంటున్నాయని అధికారులు తమ రిపోర్టుల్లో పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన బోడుప్పల్, ఫిర్జాదిగూడ, జవహర్‌నగర్, నిజాంపేట్,బడంగ్‌పేట, బండ్లగూడ జాగీర్, మీర్‌పేట కార్పొరేషన్లలో ముంపు సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు.
కబ్జాలో లీడర్లు.. చర్యలు తీసుకోలేని స్థితిలో ఆఫీసర్లు
కుంటలు మాయమవడం.. కాల్వలు, నాలాలకు అడ్డంగా గోడలు కట్టడం..ఇష్టారీతిగా రోడ్ల నిర్మాణం, అక్రమ కట్టడాలు, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతోనే వర్షాకాలంలో ఎక్కడికక్కడ రోడ్లపై నీళ్లు నిలుస్తున్నాయని, కాలనీలు మునుగుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఒక్క జీహెచ్ఎంసీలోనే దాదాపు 4 వేల ముంపు ప్రాంతాలు ఉన్నట్లు గుర్తించారు. ఇతర పట్టణాల్లోనూ వందల సంఖ్యలో ముంపు ప్రాంతాలు ఉన్నాయని తేల్చారు. అక్రమ నిర్మాణాల్లో, చెరువులు, కుంటల కబ్జాల్లో అధికార పార్టీ లీడర్లే ఎక్కువ ఉంటున్నారు. కొత్త మున్సిపల్ చట్టం ఆధారంగా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉన్నప్పటికీ అంతా అధికార పార్టీ లీడర్లు, వారి అండదండలు ఉన్నవాళ్లే కావడంతో అధికారులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు.
అన్ని సిటీలకు కొత్త మాస్టర్ ప్లాన్లు తెస్తమని చెప్పి..!
2020లో భారీ వర్షాలకు గ్రేటర్ హైదరాబాద్‌లో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. అనేక కాలనీలు, ఇండ్లు రోజుల తరబడి బురదలోనే ఉన్నాయి. అప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని సిటీలకు కొత్త మాస్టర్ ప్లాన్లు అవసరమని.. హడావుడిగా ప్రపోజల్స్ తయారు చేసే పనిని ప్రభుత్వం పెట్టుకుంది. కానీ క్షేత్రస్థాయిలో అమల్లోకి తేవడంలో మాత్రం ఫెయిల్ అయింది. కొత్తగా ఏర్పాటైన కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అనేక గ్రామాలు కలిపారు. వాటికి తగ్గట్టుగా మాస్టర్ ప్లాన్ చేయాల్సి ఉంది. అయితే.. పలు చోట్ల మాస్టర్ ప్లాన్లు కొత్త వివాదాలు తెచ్చిపెట్టాయి. లీడర్ల భూములకు మేలు చేసేలా.. రైతుల పంటపొలాలను గుంజుకునేలా డ్రాఫ్ట్‌లు ఉండటంతో అక్కడి ప్రజలు ఆందోళనలకు దిగారు. దీంతో ఈ ఏడాది జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా మాస్టర్‌ప్లాన్లు వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
మాస్టర్ ప్లాన్ పక్కాగా అమలు చేస్తే..
మాస్టర్ ప్లాన్ సరిగ్గా అమలు చేస్తే భారీ వర్షాలు వచ్చినా వరద నీళ్లు నివాస ప్రాంతాల్లోకి చేరకుండా ఉంటుందని ఆఫీసర్లు చెప్తున్నారు. పట్టణాల్లో చేపట్టే నిర్మాణాలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్ ఏరియా, మల్టీజోన్, సెమీ పబ్లిక్, బఫర్‌జోన్, అగ్రికల్చర్ తదితర జోన్లుగా మాస్టర్ ప్లాన్‌లో విభజిస్తారు. ఆ ప్రకారమే అక్కడ నిర్మాణాలకు అనుమతులు లభిస్తాయి. ఇరుకు రోడ్లను ప్రజల డిమాండ్‌కు తగ్గట్టుగా విస్తరిస్తారు.
111 జీవో పరిధిలోని ప్రాంతాల్లో భయం భయం
హైదరాబాద్‌లోని జంట జలాశయాల పరిరక్షణ కోసం తీసుకువచ్చిన 111 జీవోను ఎత్తివేస్తున్నట్లు ఇటీవల రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. హెచ్ఎండీఏ రూల్స్ ఆ ప్రాంతాల్లో అమలు చేస్తామని పేర్కొంది. ఇప్పటికే అక్రమ కట్టడాలు వెలిశాయి. పెద్ద ఎత్తన నిర్మాణాలకు అవకాశం ఇస్తే.. భారీ వర్షాలు కురిసి వరదలు వస్తే.. ఆ ప్రాంతాలు నీట మునుగుతాయని స్థానికులు భయపడుతున్నారు.
ఏండ్ల నాటి మాస్టర్ ప్లాన్లే దిక్కు
గతంలో భారీ వర్షాలకు, వరదలకు ఖమ్మం, వరంగల్, కరీంనగర్, జగిత్యాల, నల్గొండ, నిజామాబాద్, నిర్మల్ వంటి సిటీల్లోని అనేక కాలనీలు నీట మునిగాయి. అయినా.. ప్రభుత్వం వాటి మాస్టర్ ప్లాన్లను అప్‌గ్రేడ్ చేయడం లేదు. ఇప్పటికీ 40, 50 ఏండ్ల కిందటి ప్లాన్లే అమలులో ఉన్నాయి. వరంగల్‌లో 1972లో అప్పటి లక్ష జనాభాకు తగ్గట్టుగా పట్టణ విస్తీర్ణం 30 చదరపు కిలోమీటర్లు ఉండేది. ఇప్పుడు కాజీపేట, హన్మకొండ, వరంగల్‌తో పాటు 42కిపైగా గ్రామ పంచాయతీలు కలుపుకుని పది లక్షల జనాభాతో 407 చదరపు కిలోమీటర్లలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌గా విస్తరించింది. 2013లో ఒకసారి, 2018లో ఇంకోసారి గ్రేటర్ వరంగల్ కోసం కొత్త మాస్టర్ ప్లాన్ రెడీ చేసినా ప్రతిపాదనల దగ్గర్నే ఆగిపోయింది. నిజామాబాద్ కార్పొరేషన్‌కు 1974లో రూపొందించిన మాస్టర్‌ప్లానే అమలవుతున్నది. ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్‌కూ 1998 నాటి ప్లాన్లే ఉన్నాయి. జగిత్యాలకు 1989, నల్గొండ, మిర్యాలగూడకు 1987 నాటి మాస్టర్ ప్లాన్లే దిక్కయ్యాయి.
సర్కార్‌కు చిత్తశుద్ధి లేకనే..!
రాష్ట్ర ప్రభుత్వానికి పట్టణ ప్రణాళికపై చిత్తశుద్ధి లేదు. జీహెచ్ఎంసీలో ఇన్నిసార్లు ఇండ్లలోకి నీళ్లు వచ్చినా కనీసం ఏం చేయాలనే దానిపై సరైనా ప్లాన్ లేదు. అక్రమ కట్టడాలు ఎవరివి ఉంటున్నాయి..నాలా, వరద కాలువల్లో కబ్జాలు ఎవరివి? ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేశారు.. సంతో షం. కానీ ఉన్న మున్సిపాలిటీలు, కొత్త మున్సిపాలిటీల్లో మాస్టర్ ప్లాన్లు అవసరం లేదా? మాస్టర్ ప్లాన్లను ఎవరి కోసం తయారు చేసి.. మళ్లీ ఎవరి కోసం పక్కన పెట్టారో చెప్పాలి.
- దొంతి నర్సింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్