రాష్ట్రంలో పలు జిల్లాల్లో జులై 17వ తేదీ సోమవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. వానల కోసం ఎదురుచూసిన రైతులు రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటు వరంగల్ జిల్లా వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. సోమవారం నల్లబెల్లి మండలంలో అత్యధికంగా 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దుగ్గొండిలో 5.02, వరంగల్‌లో 4.6, నర్సంపేటలో 3.6, ఖిలా వరంగల్‌లో 3.4, గీసుకొండలో 3.2, ఖానాపూర్, చెన్నారావుపేటలో 2.3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది.
భారీ వర్షాల నేపథ్యంలో వరంగల్ అధికార యంత్రాంగం అప్రమత్తమైది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. 24 గంటల పాటు సేవలు అందించేలా కంట్రోల్ రూమ్ లో మూడు షిప్టుల్లో పనిచేసేలా సిబ్బంది నియమిచారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలు 18004251980, 9701999645 నెంబర్లకు, వాట్సప్ నంబర్ 7997100300లను సంప్రదించాలని అధికారులు సూచించారు.