- జలదిగ్భంధంలో మానుకోట
- ఉమ్మడి వరంగల్జిల్లాలో పలుచోట్ల వరదలకు తెగిపోయిన రోడ్లు
- నిలిచిపోయిన రాకపోకలు
- పట్టణాల్లో ఇండ్లలోకి వాన నీరు
- ముంపు ప్రాంతాలను పరిశీలించిన ప్రజాప్రతినిధులు, అధికారులు
ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలో వర్షం దంచి కొట్టింది. శనివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి మానుకోట జిల్లా జలదిగ్భంధంలో మునిగిపోయింది. వరంగల్, హనుమకొండ, జనగామ, ములుగు, భూపాలపల్లి జిల్లాలో కురిసిన వర్షాలకు ఆయా చోట్ల రోడ్లు తెగిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి రోడ్లు చెరువులను తలపించాయి. ఇండ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. పలుచోట్ల పునరావాస కేంద్రాలకు ముంపు ప్రాంతాల ప్రజలను తరలించారు. ముంపు ప్రాంతాలను ప్రజాప్రతినిధులు, అధికారులు తనిఖీ చేశారు. ఆయా జిల్లాల్లో పంటలు మునిగిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు సోమవారం స్కూల్స్‌కు సెలవు ప్రకటించారు.
వెలుగు, నెట్వర్క్
మహబూబాబాద్ జిల్లాలో జిల్లా సగటు వర్షపాతం 296.7ఎంఎం కాగా, ఒక్క రోజే 4747.3 ఎంఎం వర్షపాతం కురిసింది. కేసముద్రం మండలం ఈదుల పూస పెల్లి, ఇంటికన్నె రైల్వే స్టేషన్ సమీపంలో రెండు చోట్ల రైల్వే ట్రాక్ పై నుంచి భారీగా వరద పోవడంతో ట్రాక్ పూర్తిగా దెబ్బతింది. దీంతో మహబూబాద్ రైల్వే స్టేషన్ లో మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్, సింహపురి ఎక్స్‌ప్రెస్ లను నిలిపివేశారు. ప్రయాణికులకు మహబూబాబాద్ టౌన్ సీఐ దేవేందర్, పలు సంఘాలు, రాజకీయ నాయకులు తాగునీరు, అల్పాహారం అందించారు.
కాగా, నెల్లికుదురు మండలం మైల సముద్రం చెరువు, రావిరాలలో రెండు చెరువులు, ఆలేరు పెద్ద చెరువు, మహబూబాద్ మండల పరిధిలో లక్ష్మీపురంలోని కొత్తచెరువు, కట్టుకుంటా, పట్టణంలోనే దామరకుంట, కురవి మండలంలో అయ్యాగారిపల్లె, చింతపల్లి చెరువులు తెగిపోయాయి. కలెక్టరేట్ లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ 7995074803 ఏర్పాటు చేశారు. నెల్లికుదురు మండలం రావిరాలలో ఆటో, సూరుగు మల్లయ్య కి చెందిన 150 గొర్రెలు కొట్టుకు పోయాయి. కాగా, మంత్రి సీతక్క కలెక్టర్‌తో సమీక్ష నిర్వహించి, సహాయక చర్యలు తీసుకోవాలని సూచించారు.
4-జనగామ జిల్లాలో సరాసరి 107.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జనగామ మండలంలోని వడ్లకొండ-–హుస్నాబాద్ వెళ్లే రోడ్డులో గానుగుపహాడ్ వద్ద డైవర్షన్ రోడ్డు తెగిపోయింది. లింగాల ఘన్పూర్ మండలంలోని కుందారం వెళ్లే రోడ్డులో పటేల్ గూడెం వద్ద డైవర్షన్ రోడ్డు తెగి పోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రఘునాథపల్లిలో వరంగల్–-హైదరాబాద్ హైవే పై భారీగా వరద చేరడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. జనగామ జిల్లా కేంద్రం హైదరాబాద్ రోడ్డులో నీళ్లు నిలిచాయి. దర్దెపల్లి వాగు ఉప్పొంగడంతో పాలకుర్తి-–తొర్రూరుల మధ్య రాకపోకలను పోలీసులు బంద్ చేయించారు. దేవరుప్పుల మండలం వడవెండిలో గ్రామానికి చెందిన చంద్రయ్య, అంకూశ్కు చెందిన దాదాపు 150 మేకలు, గొర్రెలు మాలాగులో కొట్టుకుపోయాయి.
4- గ్రేటర్వరంగల్లో ప్రధాన రోడ్లన్నీ చెరువులను తలపించాయి. వరంగల్, హనుమకొండ పట్టణ ప్రాంతాల్లో వరద నీరు పెద్ద ఎత్తున చేరింది. మేయర్ గుండు సుధారాణి, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, స్థానిక కార్పొరేటర్లతో కలిసి లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. వరంగల్ బీరన్నకుంటలో వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ బాధితులను తాడు సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలు తీసుకున్నారు. వరంగల్‌జిల్లాలోని నర్సంపేట - చెన్నారావుపేట రూట్లోని ముగ్గుంపురం లోలెవల్ కాజ్‌వేపై నాలుగు అడుగుల వరద నీరు ఉప్పొంగంతో రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తగూడ రూట్లో అశోక్‌నగర్ సమీపంలోని లోలెవల్ కాజ్‌వేపై, నర్సంపేట - గూడూరు రూట్లో రాళ్ల వాగు పొంగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నర్సంపేటలో స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఎన్టీఆర్ నగర్‌తో పాటు పలు లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు.
4ములుగు జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గోవిందరావుపేట మండలంలోని గుండ్ల వాగు, తాడ్వాయి మండలంలోని మొండ్యాల తోగు, జలగలంచవాగు, మేడారం జంపన్న వాగు వరద ఉధృతి పెరిగింది. దీంతో శనివారం రాత్రి పస్రా-తాడ్వాయి మధ్యలో 163 నేషనల్ హైవేపై రాకపోకలను పోలీసులు బంద్ చేశారు. మేడారం-తాడ్వాయి రోడ్డుపై సుమారు 200 చెట్లు ధ్వంసం అయ్యాయి.
భూపాలపల్లి, ములుగు జిల్లాలలోని గోదావరి తీరంలో ఆఫీసర్లు హై అలర్ట్ ప్రకటించారు. గోదా వరి వరద గంట, గంటకు పెరుగుతుంది. మేడిగడ్డ బ్యారేజీ వద్ద 1.40 క్యుసెక్కుల అవుట్ ఫ్లో నమోదైంది. గోదావరి ముంపు గ్రామాల వారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.