
- తెల్లవారుజామున ఇండ్లలోకి చేరిన వరద నీరు.. నీట మునిగిన వస్తువులు, వంట సామాను
- మోకాళ్ల లోతు నీళ్లతో కాలనీల జనం ఇబ్బందులు
- వర్షం ఆగకపోతే మరిన్ని కాలనీల్లోకి వడ్డేపల్లి చెరువు, బొందివాగు నీళ్లు
వరంగల్, హనుమకొండ, వెలుగు: వరంగల్కాలనీల్లోకి వరద నీరు పోటెత్తింది. బుధవారం రాత్రి, గురువారం పొద్దున దంచికొట్టిన వానకు గ్రేటర్ వరంగల్లోని ఎస్సార్ నగర్‍తో పాటు సాయిగణేశ్ కాలనీ, చాకలి ఐలమ్మ నగర్‍లో పదుల సంఖ్యలో ఇండ్లల్లోకి వరద చేరింది. ముందుగదితో పాటు బెడ్‍రూం, కిచెన్‍లోకి మంచాల లోతు వరద రావడంతో టీవీ, ఫ్రిజ్ వంటి వస్తువులన్నీ పాడయ్యాయి. వంట చేసుకోడానికి వీల్లేకుండా ఉప్పుపప్పు తడిసిపోయాయి. దీంతో కాలనీ జనాలకు జాగారం తప్పలేదు. వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఆఫీసర్లు పునరావస కేంద్రాలకు రావాలని సూచించినప్పటికీ బాధితులు తమ ఇండ్లకు తాళాలు వేసి బంధువుల ఇండ్లకు వెళ్లారు. వాన దంచికొట్టిన ప్రతీసారి హనుమకొండలోని అంబేద్కర్ భవన్ ఏరియా వరద నీటితో నిండిపోతోంది. ప్రయాణికులు రోడ్లపై వెళ్లలేని పరిస్థితి ఉంటోంది. అయితే వర్షం కురిసే టైంలో మోకాళ్ల లోతు నీరు నిలుస్తుండగా.. గంట, రెండు గంటల్లో వరద నాలాల్లోకి వెళ్లిపోతుండడంతో జనాలు ఇండ్లను ఖాళీ చేయడానికి ఇష్టపడట్లేదు. కాగా, హనుమకొండకు వడ్డేపల్లి చెరువు ఇప్పుడిప్పుడే మత్తడి పడింది. వరద అక్కడి నుంచి గోపాల్‍పూర్ చెరువులోకి చేరుతోంది.
వర్షాలు మరో రెండు మూడ్రోజులు రోజులు ఇలానే కంటిన్యూ అయితే పైనుంచి వర్షపు నీరు గోపాల్‍పూర్, సమ్మయ్యనగర్ మీదుగా సిటీలోని పలు కాలనీల్లోకి చేరే అవకాశం ఉంది. వరంగల్లో బొందివాగు నిండితే హంటర్రోడ్, ఎన్‍టీఆర్ తదితర కాలనీ వరద ప్రమాదం తప్పేలా లేదు. దీంతో ఆయా కాలనీల్లో ఉండే పబ్లిక్ వణికిపోతున్నారు.