బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వానలు పడుతున్నాయి. హైదరాబాద్ సిటీలో నిన్న సాయంత్రం నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు వర్షం దంచికొట్టింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, షేక్ పేట్, మణికొండ, మెహదీపట్నం, రాజేంద్ర నగర్, నాంపల్లి, అబిడ్స్, కోఠి, బేగంపేట, ఖైరతాబాద్ లో కుండపోతగా వాన కురిసింది. సిటీ శివారు ప్రాంతాల్లోనూ ఆగకుండా వర్షం పడింది. మేడ్చల్ జిల్లా కీసర, ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీల్లో వాన పడింది. ఉప్పల్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీ నగర్, మీర్ పేట్, మలక్ పేటలో వాన దంచికొట్టింది. తొమ్మిది గంటల తర్వాత కాస్త తగ్గినట్లు కనిపించినా 10 గంటల తర్వాత మరోసారి భారీ వర్షం పడింది. దీంతో కాలనీల్లో నాలాలు, డ్రైనేజీలు పొంగిపొర్లాయి. రోడ్లు నదులను తలపించాయి. భారీ వర్షంతో చాలా కాలనీల్లో కరెంట్ సరఫరా నిలిపివేశారు. దీంతో జనం ఇబ్బంది పడ్డారు. సిటీ ప్రధాన రహదారుల్లో వరద నీటితో.... గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది.
కుండపోతగా పడిన వానతో రోడ్లపై మోకాళ్ల లోతులో నీళ్లు నిలిచాయి. దాంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దారుసలం నుంచి బేగంబజార్ కు వెళ్ళే రోడ్లపై వరద నీరు చెరువులను తలపించింది. కొన్ని అపార్ట్ మెంట్ సెల్లార్లలోకి నీళ్ళు చేరాయి. కొన్ని ఏరియాల్లో బైక్స్ కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాలాలు, డ్రైనేజీలు ఉప్పొంగాయి. కొన్ని కాలనీల్లో మోకాలి లోతు నీళ్లు నిలిచిపోయాయి. ఇండ్లు, షాపుల్లోకి వరద నీరు చేరింది.
నగరంలో కురిసిన భారీ వర్షానికి అంబర్ పేటలోని మూసారాంబాగ్ వంతెన మరోసారి నీట మునిగింది. లోతట్టు ప్రాంతం కావడంతో చుట్టుపక్కల ఏరియాల నుంచి భారీగా వచ్చిన వరద నీరు మొత్తం మూసారాంబాగ్ వంతెన పైకి చేరింది. దీంతో వంతెన నీట మునిగింది. వంతెనకు ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి. కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు వాహనాలను గోల్నాక వంతెన మీదుగా దారి మళ్లించి సహాయక చర్యలు చేపట్టారు. యాకుత్ పురా రైల్వేస్టేషన్ RUB దగ్గర నాలా పనులు మధ్యలో ఆగిపోవటంతో చుట్టుపక్కల ఇండ్లలోకి నీరు చేరింది.
రాజ్ భవన్ రోడ్ లో రాత్రి వర్షపు నీరు భారీగా నిలిచింది. GHMC హెడ్డాఫీసులోని CPRO సెక్షన్ లోకి నీళ్ళు చేరాయి. హైదరాబాద్ కలెక్టరేట్ లోని ఓ ఫ్లోర్ కురుస్తుండటంతో నీళ్లు చేరాయి. ఎర్రమంజిల్ చౌరస్తా, ఆసిఫ్ నగర్ లోనూ వరద నీరు ప్రవహించింది. వాటర్ లాగింగ్, చెట్ల కొమ్మలు, విద్యుత్, డ్రైనేజీ సమస్యలు ఉన్నాయంటూ.... GHMC కంట్రోల్ రూమ్ కు రాత్రి రెండు గంటట్లోనే 150 ఫిర్యాదులు వచ్చినట్టు సిబ్బంది తెలిపారు.
భారీ వర్షానికి కోఠిలోని ENT హాస్పిటల్ లో రోగులకు ఇబ్బందులు తప్పలేదు. హాస్పిటల్ పాత బిల్డింగ్ లో ఐసీయూ క్యాజువాలిటీలో పెచ్చులు ఊడిపోవడంతో పేషెంట్లపై వర్షం నీరు పడింది. గోడలకు ఆనుకుని ఉన్న కరెంట్ వైర్ల వెంబడి వర్షం నీరు కారడంతో కొద్ది సేపు పేషెంట్లు ఇబ్బంది పడ్డారు. వెంటనే అధికారులు రియాక్ట్ అయి అందులో ఉన్న వారిని కొత్త బిల్డింగ్ కు తరలించారు.
మెహిదీపట్నం నవోదయ కాలనీలో 11 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదయింది. నాంపల్లి 10.3, ఖైరతాబాద్ 10.2, గన్ ఫౌండ్రీలో 10, అత్తాపూర్ లో 8.7, సరూర్ నగర్ లో 7.9, ఆసిఫ్ నగర్, హిమాయత్ నగర్ లలో 7.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక ఉపరితల ఆవర్తన ప్రభావంతో మరో రెండు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు పడే చాన్సుందని తెలిపింది వాతావరణ శాఖ. ఉరుములు, మెరుపులతో వానలు పడతాయని తెలిపింది.