- భయంలో గోదావరి పరివాహక ప్రజలు
- పొంగిపొర్లిన వాగులు... రాకపోకలు బంద్
నెట్వర్క్, వెలుగు: గత రెండు రోజులుగా కురుస్తున్న వానలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వేములవాడ, సిరిసిల్ల టౌన్లలోకి వరద నీరు చేరింది. దీంతో లోతట్టు ప్రాంతాలు పట్టణంలోని పలు కాలనీలు జలమయం అయ్యాయి. వేములవాడలో చెక్కపల్లి రోడ్ లో గల విద్యుత్ సబ్‌స్టేషన్ లోకి వరద చేరడంతో పట్టణంలో 12 గంటల పాటు కరెంట్సప్లై నిలిచిపోయింది. పట్టణంలోని మూలవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. కాశాయిపల్లి చెరువుకు స్పల్పంగా గండిపడడంతో గ్రామస్థులు భయందోళనకు గురవుతున్నారు. గంగాధర, కొత్తపల్లి మండలాల్లోని చెరువులు, కుంటలు మత్తడులు దూకుతున్నాయి. గట్టుభూత్కూర్ చెరువు భారీగా మత్తడి దూకుతుండడంతో గంగాధరకు, కొత్తపల్లి పట్టణ శివారులోని రోడ్ డ్యాం మీదుగా వరదనీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు బంద్అయ్యాయి. ఈపెద్దపల్లి జిల్లాలో గోదావరి నది, మానేరు, హుస్సేన్‌మియా వాగు పరివాహక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సిరిసిల్ల పట్టణంలోకి వరద నీరు చేరి లోతట్టు ప్రాంతాలు మునిగాయి. సిరిసిల్ల జిల్లా ను రెడ్ అలెర్ట్ గా ప్రకటించడంతో కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే అధికారులను అప్రమత్తం చేశారు. సిరిసిల్లలో అత్యధిక వర్షపాతం 12 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. నేడు జరిగే ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రకటించారు. సుల్తానాబాద్ మండలం మానేరు వాగులో 12 బర్రెలు చిక్కుకుపోయాయి. ఇందులో ఆరు బయటకు వచ్చాయి.
ఎల్ఎండీ 16 గేట్ల ఎత్తివేత
తిమ్మాపూర్: గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా ఎల్ఎండి రిజర్వాయర్ లోకి వరద నీరు వచ్చి చేరుతున్నాడంతో అధికారులు 16 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మిడ్ మానేర్ కు నుంచి 12 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
చెక్ డ్యామ్‌లో కొట్టుకువచ్చిన గుర్తు తెలియని శవం
కరీంనగర్ రూరల్: కరీంనగర్ రూరల్ మండలం గోపాల్పూర్ శివారులో గల చెక్‌డ్యామ్‌లో వరదకు గుర్తుతెలియని యువకుడి శవం కొట్టుకువచ్చింది. వయస్సు 20 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉంటుందని పోలీసులు తెలిపారు.