దంచికొట్టిన వానలు.. పిడుగులు పడి ఇద్దరు మృతి

  • పొంగిపొర్లిన వాగులు.. నేలకొరిగిన మక్క చేన్లు 
  • పిడుగులు పడి ఇద్దరు మృతి 
  • కడెం ప్రాజెక్టులోకి భారీ వరద.. మూడు గేట్లు ఓపెన్ 

నెట్​వర్క్, వెలుగు: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, మంచిర్యాల, జయశంకర్​భూపాలపల్లి, కామారెడ్డి, ములుగు జిల్లాల్లో వానలు దంచికొట్టాయి. పలుచోట్ల వాగులు పొంగిపొర్లి రాకపోకలు నిలిచిపోయాయి. పలు పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల చెట్లు విరిగిపడగా, విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. అత్యధికంగా కరీంనగర్ జిల్లా ఆసిఫ్ నగర్​లో 12.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. సిరిసిల్లలోని పెద్దలింగాపురంలో 12, పెద్దపల్లిలోని కునుకులలో 11.5, సుగ్లంపల్లిలో 10.5, ఇల్లంతకుంటలో 10.2, కూనారంలో 10, కల్వచర్లలో 9.5, మంచిర్యాలలోని కుందారంలో 8.8, భూపాలపల్లిలోని తాడిచెర్లలో 8.3, నిర్మల్ లోని అక్కాపూర్​లో 8.1, కామారెడ్డిలోని గాంధారిలో 7.8 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. 

కరీంనగర్ ​జిల్లాలోని రామడుగు మండలం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన రిజ్వాన బేగం ఇల్లు వర్షానికి కూలిపోయింది. కొత్తపల్లి, గంగాధర మండలంలోని గట్టుభూత్కూర్  చెరువులు మత్తడి దుంకుతున్నాయి. జగిత్యాల జిల్లాలో జగిత్యాల, మెట్​పల్లి, ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీల్లో భారీ వర్షంతో ఇండ్లలోకి వరద చేరింది. ఈదురు గాలులకు  చెట్లు కూలిపోయాయి. గోదావరిఖనిలో రైల్వే అండర్‌‌‌‌‌‌‌‌ బ్రిడ్జి వద్ద ఆర్టీసీ బస్సు వరదలో నిలిచిపోయింది. వర్షం కారణంగా సింగరేణి పరిధిలోని నాలుగు ఓపెన్‌‌‌‌‌‌‌‌ కాస్ట్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లలో ఉదయం షిప్టులో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలో కోరెం వాగు, స్తంభంపల్లి వద్ద గంజి వాగు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. 

నిర్మల్ పట్టణంలో రెండు గంటలపాటు కురిసిన భారీ వర్షానికి డాక్టర్స్ లేన్, మంచిర్యాల చౌరస్తా, విశ్వనాథ్ పేట్, వైఎస్సార్ కాలనీ, ఇందిరానగర్ ప్రాంతాలు నీటమునిగాయి. బైంసా పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కామారెడ్డిలో ఆదివారం తెల్లవారుజామున జోరు వాన కురిసింది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి తదితర మండలాల్లో కురిసిన వర్షానికి వాగులు పొంగిపొర్లాయి. కరీంనగర్, మంచిర్యాల హైవేపై వెల్గటూర్ సొసైటీ ఆఫీసు ముందు పెద్ద చెట్టు విరిగిపడింది. జనగామలో చెట్లు విరిగిపడి విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం వెంగంపేట, కేశవపట్నం, సీతానగరం, గుండెంగ గ్రామాల్లో మక్క చేన్లు నేల కొరిగాయి. చేతికందిన పంట నేల పాలైందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.  

మూడు చోట్ల పిడుగులు.. 

రాష్ట్రంలో పిడుగులు పడి ఇద్దరు చనిపోయారు. సిరిసిల్లలోని బీవై నగర్ కు చెందిన పడిగే సతీశ్(30) ఆదివారం ఉదయం స్నేహితులతో కలసి క్రికెట్ ఆడేందుకు చిన్నబోనాల   గ్రౌండ్ కు వెళ్లాడు. క్రికెట్ ఆడుతుండగా వర్షం పడటంతో దగ్గరలోని చింతచెట్టుకు కింద నిలబడ్డాడు. ఆయనపై పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మెకానిక్ గా  పనిచేసే సతీశ్​కు భార్య మధుప్రియ, పది నెలల వయసున్న కొడుకు ఉన్నారు. పొలంలో ఉండగా పిడుగు పడి కుమ్రం భీమ్ జిల్లా వాంకిడి మండలం ఎనగొందిలో ఆత్రం గోవింద్ రావు (35) చనిపోయాడు. గోదావరిఖనిలోని అంబేద్కర్‌‌‌‌‌‌‌‌నగర్ లో పిడుగుపాటుకు 25 టీవీలతో పాటు సెట్‌‌‌‌‌‌‌‌అప్‌‌‌‌‌‌‌‌ బాక్స్‌‌‌‌‌‌‌‌లు కాలిపోయాయి. దగ్గర్లోని ఫైవింక్లయిన్‌‌‌‌‌‌‌‌ చౌరస్తాలో తోపుడు బండిపై బజ్జీలు అమ్ముకునే లక్ష్మి.. పిడుగు శబ్దానికి వణకడంతో కడాయిలోని నూనె మీద పడి తీవ్ర గాయాలయ్యాయి. 

నిండుతున్న కడెం ప్రాజెక్టు..

కడెం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్ట్ కెపాసిటీ 7.603 టీఎంసీలు కాగా ప్రస్తు తం 6.684 టీఎంసీల నీరుంది. పైనుంచి 33,546 క్యూసెక్కుల ఇన్​ఫ్లో ఉండగా, ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి 36,079 క్యూసెక్కులను కిందికి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కాగా, ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం తర్నంవాగులో ఆదివారం ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. ఇద్దరు కూలీలు వరదలో చిక్కుకోగా, స్థానికులు కాపాడారు.