- పిడుగులు పడి ఐదుగురు మృతి
- నిజామాబాద్‌లో నీళ్లలో ఆగిన బస్సు
- పలుచోట్ల కుండపోత.. కాలనీలు జలమయం
- గద్వాల, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షం
- యాదాద్రిలో చాలా రోజుల తర్వాత వాన
- హైదరాబాద్‌లో నేడు, రేపు భారీ వర్షాలు
నెట్వర్క్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. సోమవారం అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడినభారీ వర్షం కురిసింది. మూడు జిల్లాల్లో పిడుగులు పడి ఐదుగురుమృతిచెందారు. పండుగపూట పడిన పిడుగులు ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. గద్వాల, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. నిజామాబాద్ లో రైల్వే బ్రిడ్జి వద్ద ఐదు అడుగుల లోతు నీళ్లు నిలవడంతో అందులో ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది. దీంతో పోలీసులు, యువకులు రంగంలోకి దిగి బస్సులోని ప్రయాణికులను కాపాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాను చాలా రోజుల తర్వాత వర్షాలు పలకరించాయి. హైదరాబాద్ సిటీలోనూ సోమవారం వర్షం దంచికొట్టింది. ట్రాఫిక్ జాంలతో జనం ఇబ్బందులు పడ్డారు.
పిడుగుపాటుకు ఐదుగురు మృతి
పండుగపూట పిడుగుపాటు కారణంగా ఐదు కుటుంబాల్లో విషాదం నెలకొంది. జోగులాంబ గద్వాల జిల్లాలో ముగ్గురు, మంచిర్యాల జిల్లాలో ఒకరు, వికారాబాద్ జిల్లాల్లో ఒకరు పిడుగులు పడి చనిపోయారు. గద్వాల జిల్లా గట్టు మండలం ఆరగిద్ద గ్రామంలో నల్లారెడ్డి(35) అనే రైతు, మల్దకల్ మండల కేంద్రంలో ఆదిలక్ష్మి(15) అనే బాలిక, అలంపూర్ నియోజకవర్గం క్యాతూర్ గ్రామంలో వేముల రాజు(40) అనే రైతు పిడుగు పడి అక్కడికక్కడే చనిపోయారు. గద్వాల మండలం ఉరువపల్లి గ్రామంలో పిడుగుపాటుకు ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అలంపూర్ నియోజకవర్గం కంచుపాడు గ్రామంలో పిడుగు పడి ఓ ఎద్దు చనిపోయింది. మంచిర్యాల జిల్లా భీమిని మండలం బిట్టూరుపల్లికి చెందిన రైతు జక్కుల భాస్కర్ గౌడ్( 57) పిడుగుపాటుకు మృతి చెందాడు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం సంగిరెడ్డిపల్లికి చెందిన కార్తీక్(14) సోమవారం పశువులను మేత కోసం పొలానికి తీసుకెళ్లాడు. సాయంత్రం పెద్ద శబ్దంతో పిడుగు పడటంతో కార్తీక్ అక్కడికక్కడే చనిపోయాడు.
వరద నీటిలో ఆగిన బస్సు
నిజామాబాద్సిటీలోని కంఠేశ్వర్ రైల్వే అండర్‌బ్రిడ్జి వద్ద ఐదు అడుగుల వరకు నీరు చేరగా నీళ్లలో ఆర్టీసి బస్సు ఆగిపోయింది. బస్సులో చిక్కుకుపోయిన మహిళలు, పిల్లలు సహా 22 మంది ప్రయాణికులను పోలీసులు, యువకులు కలిసి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. తర్వాత బస్సును జేసీబీ సహాయంతో బయటకు తీసి డిపోకు తరలించారు. పట్టణంలో 83.5 మిల్లీమీటర్ల భారీ వర్షం కురవడంతో చాలా చోట్ల కాలనీలు నీట మునిగాయి. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కూడా భారీ వర్షం కురిసింది. వేములవాడ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో ఇండ్లల్లోకి నీళ్లు చేరాయి. గద్వాల జిల్లా గట్టు మండలం బోయలగూడెం వద్ద వాగు పొంగి పొర్లడంతో రాకపోకలు ఆగిపోయాయి.
యాదాద్రిలో చాలా రోజులకు వర్షం
యాదాద్రి భువనగిరి జిల్లాలో చాలా రోజుల తర్వాత పలుచోట్ల వర్షం కురిసింది. వానాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా జిల్లాలో చెప్పుకోదగ్గ వానలు పడలేదు. ఈ సీజన్లో ఇప్పటివరకూ సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. సోమవారం సాయంత్రం ఒక్కసారిగా మబ్బులు కమ్ముకోవడంతో భారీగా వాన పడుతుందని ఆశించారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురవగా, మరికొన్ని చోట్ల చిరుజల్లులు పడ్డాయి. యాదగిరిగుట్టలో 88.3 మిల్లీమీటర్ల వాన పడింది. సంస్థాన్ నారాయణపురంలో 60, ఆలేరులో 69 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. మోత్కూరులో 1.3 మిల్లీ మీటర్ల వాన పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది.
సిటీకి రెండ్రోజులు ఎల్లో అలర్ట్
హైదరాబాద్ లో సోమవారం భారీ వర్షం పడింది. మధ్యాహ్నం నుంచి గ్యాప్ ఇస్తూ ఒక్కోచోట ఒక్కో సమయంలో కురిసింది. కొన్ని ప్రాంతాల్లో సడెన్ గా వర్షం రావడంతో జనం ఇబ్బందులు పడ్డారు. అత్యధికంగా షేక్ పేట్ లో 5.40 సెంటీమీటర్ల వాన పడింది. సాయంత్రం పడిన వర్షానికి రోడ్లపై మోకాళ్ల లోతు నీరు ప్రవహించింది. టోలిచౌకిలో రోడ్ల పనుల కారణంగా జనం ఇబ్బందులు పడ్డారు. సెవెన్ టూంబ్స్ నుంచి గోల్కొండ వెళ్లే రోడ్డు కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయింది. టిప్పుఖాన్ బ్రిడ్జి నుంచి లంగర్ హౌస్, నానల్ నగర్ వరకు ట్రాఫిక్ ఆగిపోయింది. ఇక్కడ రెండు కిలోమీటర్ల ప్రయాణానికి 40 నిమిషాలు పట్టింది. మెహిదీపట్నం, రాయదుర్గం, గచ్చిబౌలి, బంజారాహిల్స్, లక్డికాపూల్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. రోడ్లపై చేరిన వర్షపు నీరు తొలగేంత వరకు ఇబ్బందులు తప్పలేదు. నగరంలో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సిటీకి రెండు రోజులపాటు ఎల్లో అలర్ట్ (6.45 నుంచి11.5 సెంటీమీటర్లు కురిసే చాన్స్) జారీ చేసింది.