మహారాష్ట్రలో వర్షాలు దంచికొడుతున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైని వర్షాలు ముంచెత్తాయి. ఏకధాటిగా 24గంటల నుంచి కురుస్తున్న వర్షాలుతో ముంబైలోని జనజీవనం అతలాకుతలం అవుతుంది. ముంబైలోని చెంబురా, కలీనాలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలతో.. విహార్ లేక్ నిండుకుండలా మారింది. మరో 48 గంటలపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
భారీ వర్షాలతో పూణేలోని ఖాడక్వాస్లాలోని డ్యామ్ లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో గేట్లు ఓపెన్ చేసి ముథా నదిలోకి నీటిని విడుదల చేశారు అధికారులు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మిథి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో పాల్ఘర్ జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు అధికారులు. పూణే రూరల్ లోని అధార్వాడీ గ్రామంలో కొండచరియలు విరిగిపడటంతో.. ఒకరు మృతి చెందారు.