3.49 లక్షల ఎకరాల్లో సాగైన పత్తి, కంది, వరి
ఆఫీసర్ల అంచనా కంటే 94,082 తగ్గిన విస్తీర్ణం
యాదాద్రి, వెలుగు : కూలీల కొరతతో పాటు, పెట్టుబడి పెరగడం, మార్కెటింగ్ సమస్యలతో రైతులు పంటల సాగును తగ్గించుకుంటున్నారు. యాదాద్రి జిల్లాలో గత వానాకాలం సీజన్‌తో పోలిస్తే ఈ సారి సాగు విస్తీర్ణం భారీగా తగ్గింది. ఈ సీజన్‌లో యాదాద్రి జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల పంటలు కలిపి 4,54,430 ఎకరాల్లో సాగు అవుతాయని అగ్రికల్చర్ ఆఫీసర్లు అంచనా వేశారు. కానీ వివిధ కారణాలతో రైతులు పంటల సాగు తగ్గించుకోవడంతో జిల్లాలో ఈ సారి 3.60 లక్షల ఎకరాల్లోనే సాగు పనులు జరిగాయి. వరి, పత్తి, కంది కలిపి 3,49,393 ఎకరాల్లో సాగు చేయగా, మిగతా అన్ని పంటలు కలిసి కేవలం 10,955 ఎకరాల్లోనే సాగయ్యాయి.
భారీగా తగ్గిన కంది, పత్తి
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి రైతులు కంది సాగును తగ్గించుకున్నారు. వానలు సరిగా పడని 2017–-18 వానాకాలం సీజన్‌లోనే 16 వేల ఎకరాల్లో కంది సాగైంది. కానీ ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా 8,393 ఎకరాల్లోనే కంది సాగు జరిగింది. మద్దతు ధర బాగానే ఉన్నా అమ్మకం విషయంలో గతంలో ఏర్పడిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ సారి కంది సాగుకు రైతులు ఇంట్రస్ట్ చూపలేదని తెలుస్తోంది. అలాగే 2020–21 సీజన్‌లో 1.81 లక్షల ఎకరాల్లో సాగైన పత్తి ఈ సారి 1.10 లక్షల ఎకరాలకే పరిమితం అయింది. మద్దతు ధర బాగానే ఉండడంతో మొదట్లో పత్తి సాగుకు రైతుల ఇంట్రస్ట్ చూపారు. కానీ విత్తనాలు వేసిన మొదట్లో వర్షాలు పడకపోవడం, రెండోసారి విత్తనాలు వేసిన తర్వాత భారీ వర్షాలు పడడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో చాలా మంది రైతులు ఈ సీజన్‌లో పత్తి సాగు నుంచే తప్పుకున్నారు.
అంచనాలకు చేరువలో వరి
జిల్లాలో ఒక్క వరి సాగు మాత్రమే ఆఫీసర్ల అంచనాకు దగ్గర్లో ఉంది. వడ్ల కొనుగోలు విషయంలో గతేడాది ఏర్పడిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వరి సాగుకు రైతులు మొదట్లో వెనుకంజ వేశారు. కానీ తర్వాత వరిసాగుకు మొగ్గు చూపారు. జిల్లా వ్యాప్తంగా 2.40 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని ఆఫీసర్లు అంచనా వేయగా ఇప్పటివరకు 2.31 లక్షల ఎకరాల్లో సాగు జరిగింది. అయితే వచ్చే నెల మొదటి వారం వరకు వరి నాట్లు వేసే అవకాశం ఉండడంతో వరిసాగు మరికొంత పెరిగే అవకాశం ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు.
పోయినసారి నష్టపోయిన
పోయిన వానాకాలం సీజన్‌లో రూ. 30 వేల పెట్టుబడి పెట్టి రెండు ఎకరాల్లో కంది సాగు చేసిన. రెండు క్వింటాళ్ల దిగుబడే వచ్చింది. వీటిని ఆలేరుకు తీసుకుపోలేక క్వింటాల్‌కు రూ. 3,500 లెక్కన దళారికి అమ్ముకున్న. పోయినసారి నష్టం రావడంతో ఈ సారి కంది సాగు మొత్తమే బంద్ పెట్టిన. – పొన్నబోయిన సత్తయ్య, రైతు
పెట్టుబడి పెరిగింది
ఏటేటా పెట్టుబడి పెరుగుతోంది. అనుకున్నంత దిగుబడి రావడం లేదు. పోయిన సీజన్‌లో 4 ఎకరాల్లో పత్తి వేసిన. ఇంత చేస్తే మూడు క్వింటాళ్ల దిగుబడే వచ్చింది. పెట్టుబడులు మీద పడ్డయ్. అందుకే ఈ సారి సాగు చేయలే. – బోడ రాజశేఖర్, రైతు