సంక్రాంతి హడావిడి ముగిసింది.. రెండు మూడు రోజుల్లో పిల్లలు స్కూళ్లకు తిరిగి వెళ్లాల్సిన టైం వచ్చింది. వారమంతా సంక్రాంతి హడావిడిలో గడిపిన జనం వీకెండ్ లో తిరుమల క్యూ కట్టినట్లు కనిపిస్తోంది. శనివారం ( జనవరి 18, 2025 ) శ్రీవారి భక్తులు తిరుమలకు పోటెత్తారు. దీంతో అలిపిరి దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.అలిపిరి టోల్ గేట్ నుండి ఆర్చి వరకు వాహనాలు బారులు తీరాయి.ఈ క్రమంలో అలిపిరి చెక్ పాయింట్ దగ్గర తనిఖీలకు ఆలస్యం అవుతోంది.
అలిపిరి చెక్ పాయింట్ దగ్గర తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తున్నారంటూ శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం ( జనవరి 17, 2025 ) తిరుమల కొండపైకి కోడిగుడ్ల కూర, పలావ్ అన్నం తీసుకెళ్ళడంపై కూడా భక్తులు మండిపడుతున్నారు.
కొండపైన కోడిగుడ్ల కూర పలావ్ అన్నం ప్రత్యక్షమవ్వటం తీవ్ర కలకలం రేపటంతో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు సిబ్బంది. దీంతో వాహన తనిఖీలు ఆలస్యం అవ్వడంతో అలిపిరి దగ్గర పెద్ద ఎత్తున వాహనాలు బారులు తీరాయి. వాహనాల తనిఖీలకు సుమారు రెండు గంటల సమయం పడుతోందని సమాచారం.