- కోటలో ఘనంగా ఎల్లమ్మతల్లి బోనాల జాతర
- అమ్మవారిని దర్శించుకున్న లక్షమందికిపైగా భక్తులు
- ఆకట్టుకున్న శివసత్తుల పూనకాలు, పోతరాజుల నృత్యాలు
- భారీ వర్షంలోనూ మొక్కులు చెల్లించుకున్న భక్తులు
- ఏర్పాట్లను పర్యవేక్షించిన
- వివిధ శాఖల అధికారులు
మెహిదీపట్నం, వెలుగు: గోల్కొండ కోటలో జగదాంబిక మహంకాళి ఎల్లమ్మ తల్లి బోనాల జాతర వైభవంగా కొనసాగుతోంది. అమ్మవారికి మూడో పూజను పురస్కరించుకొని ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులుబోనాలు సమర్పించారు. డప్పు చప్పుళ్ల నడుమ శివస్తతుల పూనకాలు.. పోతరాజుల నృత్యాలతో భక్తజనం ఉత్సాహంగా కేరింతలు కొడుతూ.. భారీ తొట్టెల ఊరేగింపుతో తరలివచ్చారు. లక్ష మందికి పైగా రావడంతో కోటంతా కిక్కిరిసిపోయింది.
సాయం త్రం వర్షంలోనూ క్యూ లైన్ లో నిల్చుని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో ఒక్కసారిగా కొంతసేపు తోపులాట చోటు చేసుకోగా.. ఎవరికీ ఏం కాలేదు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ అరవింద్ మహేశ్‌కుమార్ తెలిపారు. సింగర్ మంగ్లీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. బోనాల ఉత్సవాల్లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిటీ సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు కొనసాగించారు.కోటకు వచ్చే వాహనాలతో భారీగా ట్రాఫిక్ జామ్ అవగా.. ఎప్పటికప్పుడు క్లియర్ చేశారు.
కాగా.. కోటకు కిలోమీటరు దూరంలోనే వాహనాలను నిలిపేయడంతో భక్తులు కొంత ఇబ్బంది పడ్డారు. పోలీసుల తీరుపై అసహనం వ్యక్తంచేశారు. భక్తుల సౌకర్యార్థం బల్దియా50 మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేసిందని సర్కిల్-- 13 ఈఈ వెంకట శేషయ్య తెలిపారు. జలమండలి ఆధ్వర్యంలో భక్తులకు మంచినీటి సదుపాయం కల్పించినట్టు వాటర్ బోర్డు అధికారులు తెలిపారు.
ఐదు లక్షల మంచినీటి ప్యాకెట్లతో పాటు వంటకు కూడా 50 ట్యాంకర్ల మంచినీటిని అందించినట్టు చెప్పారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. అంతేకాకుండా అత్యవసర కోసం 5 అంబులెన్స్ కూడా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఇలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేశారు